భారత మాజీ క్రికెటర్, టీమిండియా మాజీ సెలెక్టర్ వక్కడై బిశ్వేశ్వరన్ చంద్రశేఖర్(57) ఆత్మహత్యకు పాల్పడ్డారు. గురువారం సాయంత్రం సమయంలో ఇంట్లోని మొదటి అంతస్తులోని తన గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకున్నారు. చంద్రశేఖర్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు.
గురువారం సాయంత్రం గదిలోకి వెళ్లిన చంద్రశేఖర్ ఎంతసేపటికీ తలుపు తీయకపోవడంతో ఆయన భార్యకు అనుమానం చ్చింది. తలుపు ఎన్నిసార్లు తట్టినా ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో ఆమె పోలీసులకు ఫోన్ చేసింది. దీంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని తలుపు కొట్టారు.
అనంతరం కిటీకీ వైపు వెళ్లి చూడగా చంద్రశేఖర్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. గదిలో ఆత్మహత్య లేఖ కనిపించలేదని దర్యాప్తు అధికారు మురుగన్ తెలిపారు. తొలి నుంచి క్రికెట్‌నే నమ్ముకున్న చంద్రశేఖర్ దాన్నే ఆదాయ వనరుగా చేసుకున్నారు.
ఐపీఎల్ తరహాలో తమిళనాడులో జరిగే తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో ‘వీబీ కంచి వీరన్స్’ అనే జట్టుకు ఆయన యజమాని. దీంతో పాటు చెన్నైలోని వీలంచేరి ప్రాంతంలో వీబీస్ నెస్ట్ పేరుతో క్రికెట్ అకాడమీ నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవల ప్రీమియర్ లీగ్ జట్టులో నష్టాలు రావడంతో ఆయన ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.
ఈ కారణంతోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. తమిళనాడుకు చెందిన ఆయన 1988-90 మధ్య కాలంలో భారత జాతీయ జట్టుకు ఆడారు. కేవలం ఏడు వన్డేలే ఆడి 88 పరుగులు మాత్రమే చేశారు.