పెళ్లికి పెద్దలు నిరాకరించారని ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. తండావాసుల సమాచారం మేరకు వివరాలిలా.. నవాబుపేట మండలం వెంకటేశ్వరతండా పంచాయతీలోని మామిడిచెట్టుతండాకు చెందిన శాంతి అదే తండా పక్కన ఉన్న కోమటికుంటతండాకు చెందిన శివ ప్రేమించుకున్నారు. అయితే, వీరి పెళ్లికి పెద్దలు అంగీకారం తెలపలేదు. ఇదిలాఉండగా, శాంతి తన తల్లిదండ్రులతో కలిసి ఈనెల 3వ తేదీన పూణె వెళ్లింది.
శివ ఇక్కడే ప్రైవేట్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.కాగా, తమ పెళ్లికి తల్లిదండ్రులు ఒప్పుకోరనే బాధతో పూణెలో ఉన్న ప్రియురాలు శాంతి 14వ తేదీ సోమవారం ఉదయం ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలియడంతో.. నీవు లేని లోకం నాకేందుకు అంటూ ప్రియుడు శివ షాద్‌నగర్ నుంచి తన తండాకు వస్తు మార్గమధ్యలో సువర్ణకూటీర్ వద్ద పురుగుమందు తాగాడు.
అపస్మారక స్థితిలో ఉన్న అతన్ని దారిగుండా వెళ్లేవారు చూసి షాద్‌నగర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతిచెందాడు. తల్లిదండ్రులు నీలమ్మ, సేవ్యాలకు శివ ఒక్కడే కుమారుడు కావడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది. అటు పూణెలో కూతురును కోల్పోయిన పూల్‌సింగ్, చంద్రమ్మల కుటుంబం రోదనలతో గిరిజన తండాలో విషాదచాయలు అలుముకున్నాయి.