ఏటీఎంను ధ్వంసం చేయకుండానే అందులోని సొత్తును కిలాడీ ప్రేమికులు దోచుకున్న ఘటన కర్ణాటకలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఇంటి దొంగ హస్తమున్నట్టు చివరకు గుర్తించారు. బ్యాంకులో పనిచేసే క్యాషియర్.. తన ప్రియుడితో కలిసి దోచేసినట్టు తేలింది. ఈ దోపిడీలో ప్రియుడికి ఆమె సహకరించినట్టు వెల్లడయ్యింది. దీంతో నిందితులను పోలీసులు అరెస్టు చేసి.. వారి నుంచి దోపిడీకి గురైన సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.
విజయపుర జిల్లా ముద్దేబిహాళ్ పట్టణంలో యూనియన్ బ్యాంకు ఏటీఎంలో సెప్టెంబరు 18న రాత్రి దోపిడీ జరిగింది. అందులోని రూ.16 లక్షల నగదును ఏటీఎంను ధ్వంసం చేయకుండా నిందితులు దర్జాగా తాళాన్ని తీసి ఎత్తుకెళ్లారు. ఈ చోరీ గురించి బ్యాంకు మేనేజరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. అయితే, నిందితులు ఆచూకీ దొరక్కుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో పోలీసులకు కేసును చేధించడం ఓ సవాల్‌గా మారింది. ఏటీఎం కేంద్రంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో నిందితులు గురించి చిన్న ఆధారంగా కూడా లభించలేదు.
దీంతో పోలీసులు ప్లాన్ బీ ప్రకారం ముందుకెళ్లారు. చోరీ జరిగిన రోజున రాత్రి ముద్దేబిహాళ్లోని ఇతర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల్లోని దృశ్యాలను విశ్లేషించారు. ఈ క్రమంలో అన్ని కెమెరాల్లో ఓ కారు అనుమానంగా తిరుగుతున్నట్టు గుర్తించారు. కారు నెంబరు ఆధారంగా దానిలో ప్రయాణించిన నలుగురు వ్యక్తులలను అరెస్టు చేయడంతో గుట్టు బయటపడింది.
నిందితుల్లో ఒకడైన మంజునాథ్ అనే వ్యక్తిని తమదైన శైలిలో పోలీసులు విచారించడంతో అని విషయాలు వెలుగులోకి వచ్చాయి. బ్యాంకు క్యాషియర్ మస్మితా, మంజునాథ్ ప్రేమికులని తెలిసింది. ప్రియుడికి మస్మితానే ఏటీఎం పాస్వర్డ్ చెప్పడంతో దర్జాగా నగదు ఎత్తుకెళ్లినట్టు వెల్లడయ్యింది. ఈ నేరంలో బ్యాంకు సెక్యూరిటీ గార్డు కూడా సహకరించినట్టు దర్యాప్తులో తేలింది. దీంతో మంజునాథ్, మస్మిత, అతడికి సహకరించిన నలుగురు స్నేహితులను అరెస్టు చేసినట్లు తెలిపారు.