ప్రియుడి మరణం ప్రియురాలి పరిస్థితి విషమం

ప్రియుడి మరణం ప్రియురాలి పరిస్థితి విషమం

వివాహేతర సంబంధం పెట్టుకున్న వారిద్దరూ ఇళ్ల నుంచి వెళ్లిపోయారు. పెళ్లి చేసుకుంటున్నట్టు సెల్ఫీ వీడియో తీసుకున్నారు. అంతలోనే ఏమైందో ఏమో శనివారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రియుడు మరణించగా, ప్రియురాలి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళితే.. సత్తెనపల్లి వద్దనున్న పాకలపాడుకు చెందిన సంగీపు గోపి(30) 9ఏళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన లక్ష్మీతిరుపతమ్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారికి ఓ పాప. ఈ కుటుంబం పెదకాకాని మండలం వెనిగండ్లకు వలస వచ్చింది. గోపి ఆటోడ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

వెనిగండ్లకు చెందిన జూటూరి శ్యామల తన భర్త తెనాలి తాలూకా కోపల్లెకు చెందిన గోపి పదినెలల క్రితం పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకోవడంతో తన ఇద్దరు పిల్లలతో పుట్టింటికి వచ్చేసింది. అప్పటి నుంచి తల్లి వద్దే ఉంటుంది. ఈ నేపథ్యంలో సంగీపు గోపి, శ్యామల మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. నాలుగు రోజుల క్రితం వీరిద్దరూ ఇళ్ల నుంచి వెళ్లిపోయారు. పెళ్లి చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో తీసుకున్నారు. అంతలో ఏమైందో ఏమో శనివారం రాత్రి పెదకాకాని శివారులో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది వారిని గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆదివారం గోపి మరణించాడు. శ్యామల పరి స్థితి విషమంగా ఉంది. వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారని, కలిసి ఉండటం సాధ్యం కాదని ఆత్మహత్యకు ఒడిగట్టారని మృతుని తండ్రి వెంకటేశ్వర్లు చెప్పారు.