ప్రేమించిన యువతితో పెళ్లి చేసేందుకు పెద్దలు అంగీకరించకపోవడంతో ఒక యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్‌లో జరిగింది. కర్ణాటకకు చెందిన రఘునాథ్ రాథోడ్ ఘట్‌కేసర్ ఎన్‌ఎఫ్‌సీ నగర్‌లో కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు.
అతడికి నలుగురు కుమారులు, ఒక కుమార్తె సంతానం. మూడో కుమారుడు అక్షయ్‌కుమార్(25) డిప్లొమా చదివి ఉద్యోగం రాకపోవడంతో లోకల్ లో పాలవ్యాన్ నడుపుతున్నాడు. ఈ క్రమంలోనే తన ఇంటికి సమీపంలోనే ఉండే ఓ యువతితో అక్షయ్ ప్రేమలో పడ్డాడు.
ఆ అమ్మాయి కూడా ఓకే చెప్పేయడంతో ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఆమెతో పెళ్లి చేయాలని తన పేరెంట్స్‌ను కోరగా వాళ్లు ఓకే చెప్పారు. అయితే మంచి ఉద్యోగం వచ్చాకే చేస్తామని కండిషన్ పెట్టారు. మరోవైపు యువతి తల్లిదండ్రులు మాత్రం వారి ప్రేమకు నో చెప్పారు.
తమ కూతురు డిగ్రీ చదువుతోందని, ఇప్పుడే పెళ్లి చేసే ఆలోచన లేదని చెప్పడంతో అక్షయ్ మనస్తాపానికి గురయ్యాడు. రాఖీ రోజున చెల్లెలితో రాఖీ కట్టించుకున్న అక్షయ్ మధ్యాహ్న సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లాడు.
సాయంత్రమైనా రాకపోయేసరికి సోదరులు ఫోన చేయగా వస్తున్నానని చెప్పాడు. రాత్రయినా అక్షయ్ రాకపోయేసరికి వారు మళ్లీ ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున ఘట్‌కేసర్-బీబీనగర్ రైల్వేస్టేషన్ల మధ్య రైలుపట్టాలపై అక్షయ్ విగతజీవిగా పడివున్నాడు.