16న అర్ధరాత్రి చంద్రగ్రహణం

lunar eclipse on 16

ఈ నెల 16వ తేదీన అర్ధరాత్రి పాక్షిక చంద్రగ్రహణం సంభవించనున్నది. దాదాపు మూడు గంటలు సాగే ఈ చంద్రగ్రహణాన్ని దేశప్రజలందరూ వీక్షించవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని మారుమూల ప్రాంతాలు మినహా దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా గ్రహణం ఆద్యంతం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ఈ ఏడాదిలో ఇదే చివరి చంద్రగ్రహణమని పేర్కొన్నారు. 16వ తేదీ అర్ధరాత్రి తర్వాత 12:12 గంటలకు చంద్రుడు భూమి ఉపచ్ఛాయలోకి ప్రవేశిస్తాడు. ఆ సమయంలో చందమామ చుట్టూ పలుచని నల్లటి పొర ఆవరించినట్టు కనిపిస్తుంది. చంద్రుడు 1:31 గంటల సమయంలో భూమి ప్రచ్ఛాయలోకి ప్రవేశించడంతో గ్రహణం ప్రారంభ మవుతుంది. ఉదయం 3 గంటల ప్రాం తంలో గరిష్ఠ గ్రహణం కనిపిస్తుంది. తర్వా త మెల్లిగా బయటికి రావడం ప్రారంభం అవుతుంది. ఉదయం 4:30 గంటలకు ప్రచ్ఛాయ నుంచి బయటకు రావడంతో గ్రహణం పూర్తవుతుంది. ఉదయం 5:49 గంటలకు చందమామ భూమి ఉపచ్ఛాయ నుంచి బయటికి వస్తుంది.

-ఈ చంద్రగ్రహణాన్ని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వాటిచుట్టూ ఉన్న కొన్ని ద్వీపాలు, ఆఫ్రికాలో ఏ ప్రాంతం నుంచైనా చూడవచ్చు. ఆసియాలోని మారుమూల ఈశాన్య ప్రాంతాలు, ఐరోపాలో స్కాండినేవియాలోని మారుమూల ఉత్తర ప్రాంతాలు మినహా అన్ని చోట్లా వీక్షించే అవకాశం ఉన్నది. దక్షిణ అమెరికాలోని పలుచోట్ల గ్రహణం ఆవిష్కృతం అవుతుంది.
-చంద్రుడు భూమి ప్రచ్ఛాయలోకి ప్రవేశించే దృశ్యాన్ని న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, రష్యాల్లోని కొన్ని ప్రాంతాలు, ఉభయ కొరియాలు, చైనాలోని దక్షిణ మారుమూల ప్రాంతాల్లో స్పష్టంగా వీక్షించవచ్చు.
-అర్జెంటీనా, చిలీ, బొలీవియా, పెరూ, దక్షిణ అట్లాంటిక్ సముద్రం, బ్రెజిల్‌లోని కొన్ని ప్రాంతాల నుంచి గ్రహణం ముగిసి చంద్రుడు ఉదయించే దృశ్యాన్ని స్పష్టంగా చూడొచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.