బైక్‌పై వెళ్తున్న టీఆర్ఎస్ కౌన్సిలర్‌ను ట్రాక్టర్‌తో ఢీకొట్టారు. ఆపై గొడ్డలి, తల్వార్లతో విచక్షణారహితంగా నరికారు. రక్తపుమడుగులో కొట్టుమిట్టాడుతున్న ఆయనను ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందారు. మహబూబాబాద్ పట్టణంలో పట్టపగలు జరిగిన ఈ హత్యోదంతం సంచలనం కలిగించింది.హత్యకు ఆర్థిక లావాదేవీలు, భూతగాదాలే కారణమై ఉండొచ్చని పోలీసులు అంటుండగా, కౌన్సిలర్ రాజకీయ ఎదుగుదల చూడలేక ఎమ్మెల్యే శంకర్‌నాయక్ ఈ హత్య చేయించారని మృతుడి తల్లి, భార్య ఆరోపిస్తున్నారు.
ఈ మేరకు పోలీసులకూ ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ పట్టణంలోని బాబూనాయక్‌తండాకు చెందిన 8వ వార్డు టీఆర్ఎస్ కౌన్సిలర్ బానోత్ రవినాయక్ గురువారం ఉదయం పత్తిపాకలో కొత్తగా నిర్మిస్తున్న ఇంటికి బైక్‌పై వెళ్తున్నారు. పత్తిపాక సెంటర్ వద్ద కొంతమంది ట్రాక్టర్‌తో వచ్చి రవినాయక్ వాహనాన్ని ఢీకొట్టగా, రవి కింద పడిపోయారు.
అప్పటికే ఆయనను కారులో వెంబడిస్తున్న దుండగులు, ట్రాక్టర్‌పై వచ్చిన వారిలో ఒకరు గొడ్డలి, తల్వార్లతో రవిపై దాడిచేశారు. తలపై నరకడంతో రవి అపస్మారక స్థితిలోకి వెళ్లగా, చనిపోయినట్లు భావించి దుండగులు పరారయ్యారు. అదే సమయంలో అటుగా వెళుతున్న రవినాయక్ బావమరిది చిరంజీవి.. రక్తపు మడుగులో పడి ఉన్న రవినాయక్‌ను చూసి చుట్టుపక్కల వారి సాయంతో 108లో మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ రవినాయక్ మృతిచెందారు.