కుటుంబం సజీవదహనం

కుటుంబం సజీవదహనం

ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవదహనమైన విషాదకర ఘటన పంజాబ్‌లో బుధవారం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ బాధితులు ఉంటున్న గుడిసెకు నిప్పంటుకోవడంతో అందులోని ఏడుగురు మంటల్లో కాలిపోయారు. వలస కూలీలైన బాధిత కుటుంబం లూథియానా నగరం తిబ్బా రోడ్డులోని మున్సిపాల్టీ డంపింగ్ యార్డ్ సమీపంలో చిన్న గుడిసెలో నివసిస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి తర్వాత గుడిసెకు నిప్పంటుకుంది. గాఢనిద్రలో ఉండటంతో మంటలు అంటుకున్న విషయం గమనించలేకపోయారు.

దీంతో ఐదుగురు పిల్లలు సహా దంపతులు సజీవదహనమయ్యారు. లూథియానా ఈస్ట్ అసిస్టెంట్ కమిషనర్ సురీందర్ సింగ్ మాట్లాడుతూ.. బాధితులు నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి గుడిసెలో అగ్నిప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు. అయితే, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని తెలిపారు. వీరు ఎవరు? ఏ ప్రాంతం నుంచి వచ్చారనే విషయం గురించి ఆరా తీస్తున్నారు. టిబ్బా పోలీస్ స్టేషన్‌ అధికారులు కేసు నమోదుచేసి, దర్యాప్తు చేపట్టారు. భార్యాభర్త, వారి ఐదుగురు పిల్లలుగా గుర్తించామని టిబ్బా ఎస్‌హెచ్ఓ రణ‌బీర్ సింగ్ అన్నారు.