Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆసియాలోనే అతిపెద్ద జాతర మేడారం మహాజాతరకు సర్వం సిద్ధమయింది. భక్తులు లక్షలాదిగా జాతరకు తరలివస్తున్నారు. ఇప్పటికే మేడారం జనసంద్రంగా మారింది. బస్సులు, కార్లు, ట్రాక్టర్లు వంటి వాహనాలతో పాటు ఎడ్లబండ్లపైనా భక్తులు తరలివస్తున్నారు. బుధవారం నుంచి శనివారం దాగా జరిగే ఈ జాతరకు కోటిన్నరమందికి పైగా భక్తులు తరలివస్తారని అంచనా. సారలమ్మ, పగిడిద్దెరాజు,గోవింద రాజులు గద్దెలకు చేరుకోవడంతో జాతర మహాఘట్టం మొదలవుతుంది. చంద్రగ్రహణం నేపథ్యంలో భక్తులు అమ్మవారి దర్శనం చేసుకోవచ్చా అన్న సందేహాలు తలెత్తాయి.అయితే వనదేవతల రాకకు చంద్రగ్రహణంతో ఎలాంటి ఇబ్బందీలేదని, గ్రహణం ఏర్పడకముందే అమ్మవారిని ఆలయం నుంచి తీసుకువస్తామని మేడారం పూజారులు తెలిపారు.అటు భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈసారి ఆధునిక పద్ధతులు,సాంకేతికతను వినియోగిస్తోంది.
జాతరకు తరలివచ్చే భక్తులకోసం తొలిసారి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆధునిక గుడారాలు అందుబాటులోకి వచ్చాయి. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 46, అటవీ శాఖ ఆధ్వర్యంలో 100 ఆధునిక గుడారాలు ఏర్పాటుచేశారు. ఒక రోజుకు రూ.2వేలు, 12 గంటలకు రూ.వెయ్యిగా ధరలు నిర్ణయించారు. మేడారంలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను తరలించేందుకు ట్రాక్టర్లు, మినీ వ్యాన్లు ఏర్పాటుచేశారు. మేడారం భక్తులు ఈ సారి 3జీ, 4జీ సేవలు కూడా ఉపయోగించుకోనున్నారు. పలు నెట్ వర్క్ సంస్థలు తాత్కాలికంగా టవర్లు ఏర్పాటుచేసి మొబైల్ సేవలు అందిస్తున్నాయి. బీఎస్ ఎన్ ఎల్ ఉచిత వైఫై అందిస్తోంది. ఏటీఎం కేంద్రాలు అందుబాటులో ఉంటాయి. భక్తుల తాగునీటి కోసం మిషన్ భగీరథ జలాలు సరఫరా చేయనున్నారు. 10వేలమంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.