తెలంగాణా ఎన్నికల్లో తెరాసకు వ్యతిరేకంగా ఏర్పాటు కానున్న కూటమి ప్రయోగం ఆదిలోనే బెడిసి కొట్టేలా కనిపిస్తోంది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మహాకూటమిగా ఏర్పడి బీజేపీపై పోరాడాలని భావిస్తున్న కాంగ్రెస్ తెలంగాణ ఎన్నికలను ప్రయోగంగా భావిస్తోంది. అధికార పార్టీని వ్యతిరేకించే పార్టీలతో జతకట్టి మహాకూటమిగా ఏర్పాటు ద్వారా ఎన్నికల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. ఈ ప్రయోగంపై సొంత పార్టీ నుంచే వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అలాగే, కాంగ్రెస్‌తో స్నేహానికి సిద్ధమైన పార్టీలో సైతం తీవ్ర అసంతృప్తి నెలకొంది. ముఖ్యంగా సీట్ల విషయంలో పార్టీ మధ్య పేజీ నెలకొంది. తాము కోరినన్ని స్థానాలు ఇస్తేనే కూటమి లేకపోతే ఎవరి పొయ్యి వారిదే అని ఆలోచనలో ఉన్నాయి. దీపావళి తర్వాత మహాకూటమి అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమవుతున్న కాంగ్రెస్‌కు ఇదో పెద్ద తలనొప్పిగా మారింది. మొన్నటి వరకు ఎన్ని సీట్లకైనా ఓకే అన్న టీడీపీ సైతం మిగతా పార్టీలతో పోల్చుకుని మరిన్ని సీట్లు డిమాండ్ చేయడంతో కాంగ్రెస్ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు.
నవంబరు 12న ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించగానే నామినేషన్ల పర్వం మొదలవుతుంది. అయితే, మహాకూటమి ఇప్పటివరకు తమ అభ్యర్థులెవరూ అనే విషయాన్ని బయటకు వెల్లడించలేదు. దీంతో టికెట్‌పై ఆశలు పెట్టుకున్న నేతల్లో తీవ్ర అసహనం నెలకొంది. పైగా, టికెట్ ఆశిస్తున్న నేతల మధ్య సీటు నాకే దక్కుతుందంటే.. కాదు నాకే దక్కుతుందనే పోరు నెలకొంది. కొందరైతే సీటు తమకే లభిస్తుందనే నమ్మకంతో ఇప్పటికే ప్రచారం మొదలెట్టేశారు. దీంతో ప్రజలు గందరగోళానికి గురవ్వుతున్నారు. ఈ నేపథ్యంలో జాబితాను వీలైనంత త్వరగా విడుదల చేయాలంటూ నేతలంతా కూటమి పెద్దలపై ఒత్తిడి తెస్తున్నారు. కూటమిలో సీట్లు సర్దుబాటు పూర్తయినట్లేనని కాంగ్రెస్ బయటకు ప్రకటిస్తున్నా మిత్రపక్షాలు మాత్రం ఇంకా పూర్తికాలేదని చెప్పేస్తున్నాయి.
మొన్నటి వరకు ఈ విషయంలో గోప్యత పాటించిన పార్టీలు నామినేషన్ సమయం దగ్గరపడేసరికి తిరుగుబాటు చేస్తున్నాయి. సీట్ల విషయంలో రాజీపడబోమని, వీలైతే ఒంటరిగా పోరాడటానికి కూడా సిద్ధంగా ఉన్నామని సీపీఐ, టీజేఎస్ లు ఇప్పటికే స్పష్టత ఇచ్చాయి. అయితే, టీడీపీ మాత్రం కలిసే ఉంటామని చెబుతోంది. అయితే, పార్టీకి గెలిచే అవకాశాలు ఉన్న సీట్ల కేటాయింపుపై మాత్రమే కాంగ్రెస్‌పై ఒత్తిడి తెస్తోంది. సీట్ల సర్దుబాటులో భాగంగా టీడీపీకి 14 సీట్లు కేటాయించడానికి సిద్ధమైనట్లు వార్తలు వచ్చాయి. అయితే, తమకు మరో 4 సీట్లు కావాలని టీడీపీ కోరుతోంది. మరోవైపు సీపీఐ మొదట్లో 10 సీట్లను డిమాండు చేసింది. అయితే, కాంగ్రెస్.. బెల్లంపల్లి, వైరా సీట్లు మాత్రమే ఇస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. దీనిపై సీపీఐ వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. ఇక కూటమిలో మూడవ పార్టీ అయిన టీజేఎస్ సీట్ల విషయంలో మొదటి నుంచి పట్టుదలగానే ఉంది. కాంగ్రెస్ మొదట్లో ఈ పార్టీకి 5 సీట్లు కేటాయించాలని భావించింది. టీజేఎస్ నేతలు ఇందుకు అంగీకరించలేదు. తమకు మరో 10 స్థానాలు కావాలని పట్టుబట్టారు. దీనిపై సోమవారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సీట్ల సర్దుబాటుపై తుది నిర్ణయం తీసుకునేందుకు మహాకూటమి ముఖ్యనేతలంతా సోమవారం ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు. ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయంపైనే కూటమిలో ఏయే పార్టీలు మిత్రపక్షంగా ఉంటాయో ఏయే పార్టీలు పోటీకి దిగనున్నాయి అనేది తేలనుంది.