నేడు తేలనున్న టీఆరెస్ యేతర అభ్యర్థుల భవితవ్యం…!

Mahakutty Count Today

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ను గద్దె దించడమే లక్ష్యంగా ఒక పంచన చేరిన తెలంగాణ పరిరక్షణ వేదిక, నేడు అత్యంత కీలక సమావేశం జరపనుంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న సమయంలో టీఆర్ఎస్ ఓ విడత ప్రచారాన్ని నిర్వహించి, జోరు చూపిస్తున్న వేళ, ఇప్పటికింకా పొత్తులు, సీట్లు, అభ్యర్థుల వివరాలనే ఖరారు చేసుకోలేకపోయిన మహాకూటమి నేతలు, నేడు సమావేశమై చర్చలు జరపనున్నారు. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ పార్టీల నేతలు ఈ సమావేశానికి రానున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ ఈ సమావేశానికి హాజరు కానున్నారు. తెలంగాణ పరిరక్షణ వేదిక కన్వీనర్ గా కోదండరామ్ అధ్యక్షతన ఈ సమావేశం సాగనుంది.

kutami-tdp
పొత్తులో భాగంగా ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలన్న అంశమే ప్రధాన అజెండాగా సమావేశం సాగుతుందని తెలుస్తోంది. మొత్తం 119 అసెంబ్లీ స్థానాలున్న తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ 90 సీట్లలో పోటీ చేస్తామని, మిగతా సీట్లను కూటమిలోని ఇతర పార్టీలకు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెబుతుండటంతో ఈ సమావేశంలో టీడీపీ, సీపీఐ, టీజేఎస్ ల నేతలు ఏం మాట్లాడతారన్న అంశంపై సర్వత్ర ఆసక్తి నెలకొని ఉంది. తమకు 19 స్థానాలు కావాలని టీజేఎస్ ఇప్పటికే డిమాండ్ చేయగా, కాంగ్రెస్ 3 సీట్లను మాత్రమే ఇస్తామని చెబుతోంది. టీడీపీ తమకు బలమున్న ప్రాంతాల్లోని 30 స్థానాలను ఆశిస్తుండగా, 15 నుంచి 20 వరకూ మాత్రమే ఇవ్వాలన్నది కాంగ్రెస్ వ్యూహంగా తెలుస్తోంది. 5 నుంచి 10 స్థానాల్లో పోటీకి సీపీఐ నేతలు పట్టుబడుతున్నారని తెలుస్తోంది. నేటి సమావేశంలో పోటీ చేసే సీట్లపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.

uttam-kumar