మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావు పాటిల్ నీలాంగేకర్ (88) బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు. అనారోగ్యంతో పూణేలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శివాజీరావు మరణించారు. శివాజీరావుకు ఇటీవల కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయడంతో ఆయన కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా నుంచి కోలుకున్నా కిడ్నీ ఫెయిలవ్వడంతో బుధవారం తెల్లవారుజామున మరణించారని వైద్యులు చెప్పారు. శివాజీరావు మధుమేహం, బీపీ, కరోనాలతో బాధపడుతూ చికిత్స పొందుతూ మరణించారని వైద్యులు వివరించారు.
కాగా 1985 జూన్ నుంచి 1986 మార్చి వరకు శివాజీరావ్ పాటిల్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఎండీ పరీక్షలో తన కుమార్తెకు అక్రమంగా మార్కులు వేయించినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. అయితే పరీక్షల్లో అక్రమాలు జరిగినట్లు బాంబే హైకోర్టు తీర్పునివ్వడంతో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. కాగా శివాజీరావు అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం స్వస్థలం నీలాంగాలో జరగనున్నాయి.