మహర్షి తెలుగు బుల్లెట్ రివ్యూ

మహేష్ కెరియర్‌లో 25వ సినిమాగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహర్షి’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా నేడు థియేటర్స్‌లో విడుదలై బ్లాక్ బస్టర్ టాక్‌ను తెచ్చుకుంటోంది. మరి భారీ ఎత్తున క్రేజ్ సంపాదించిన ఈ సినిమా ఏమేరకు అంచనాలు అందుకుందో రివ్యోలో చూద్దాం.
కధేంటంటే :
తెలుగువాడైన రిషి కుమార్‌(మ‌హేశ్‌)ని అమెరికాలోని ఆరిజ‌న్ కంపెనీకి సి.ఇ.ఒగా నియమించబడతాడు. రిషి పి.ఎ(మీనాక్షి దీక్షిత్‌), ఓ స‌ర్‌ప్రైజ్ ఇద్దామ‌ని రిషి చ‌దివిన వైజాగ్ ఎంటెక్ పూర్వ విద్యార్థుల‌ను, లెక్చ‌ర‌ర్‌ని ఆహ్వానిస్తుంది. అంద‌రినీ చూసి ఆనంద‌ప‌డ‌తాడు. అప్పుడు అస‌లు క‌థ స్టార్ట్ అవుతుంది. హైద‌రాబాద్‌లోని రిషి వైజాగ్ ఐఐఇటి కాలేజ్‌లో ఎంటెక్ జాయిన్ అవుతాడు. అక్క‌డ త‌న‌కు ర‌వి(అల్ల‌రి న‌రేశ్‌), పూజ(పూజా హెగ్డే) ప‌రిచ‌యం అవుతారు. ముగ్గురు మంచి మిత్రుల‌వుతారు. ఓట‌మి అంటే భ‌య‌ప‌డే రిషి కుమార్ ప్ర‌తి సెమిస్ట‌ర్‌లోనూ కాలేజ్ టాప‌ర్‌గా నిలుస్తుంటాడు. రిషినిలో మంచిత‌నం, ఇంటెలిజెన్స్ చూసి పూజా అత‌న్ని ప్రేమిస్తుంది. ఎప్పుడూ భ‌య‌ప‌డే ర‌విలో రిషి కాన్ఫిడెన్స్‌ను నింపుతాడు. అదే స‌మ‌యంలో రిషి చేసిన సాఫ్ట్‌వేర్‌ని ఓ పెద్ద కంపెనీ వాళ్లు ఇష్ట‌ప‌డి, అత‌నితో డీల్ మాట్లాడాల‌నుకుంటూ ఉంటారు. అప్ప‌టికే రిషిపై కోపం పెంచుకున్న ఎం.పి కొడుకు అజ‌య్‌(కమ‌ల్ కామ‌రాజు) అసూయ ప‌డి రిషిపై ఓ ఓ కేసులో ఇరికిస్తాడు. రిషిని కాలేజ్‌నుండి పంపేయాల‌ని మేజేజ్ మెంట్ అనుకుంటున్న స‌మయంలో ఓ వ్య‌క్తి కార‌ణంగా రిషి నిర్దోషిగా బ‌య‌ట‌కు వ‌చ్చేస్తాడు. పూజ‌తో ప్రేమ‌ను కూడా కాద‌నుకుని యు.ఎస్ వెళ్లిపోతాడు రిషి. ఎదిగే క్ర‌మంలోఎవ‌రినీ ప‌ట్టించుకోని రిషికి లెక్చ‌ర‌ర్ కార‌ణంగా నిజం తెలుస్తుంది. ఆ తర్వాత కధ ఏమేం మలుపులు తీసుకున్నది అనేది వెండితెర మీద చూడాల్సిందే.
విశ్లేషణ :
సినిమాలో ప్రధానాంశంగా రైతుల గురించి చెప్ప‌డం బావుంది. కానీ ఫారిన్‌లో కంపెనీకి సీఈఓ కూడా అయిన కొడుక్కి తండ్రి గ‌తం తెలియ‌క‌పోవ‌డం, కొడుకు ఓడిపోయాడన్న బాధలో త‌ల్లి చెప్ప‌డం లాజిక్స్ కో అందదు. మరోపక్క
హీరో, హీరోయిన్ల మ‌ధ్య ప్రేమ దూర‌మ‌వుతున్న క్ర‌మంలో నిలదీసిన ఫ్రెండ్ చెంప పగలకొట్టిన హీరో `న‌న్ను నువ్వు అర్థం చేసుకున్న‌ది ఇంతేనా` అని ఫ్రెండ్‌ను ఉద్దేశించి హీరో అనే మాట‌ల్లో అంత క్లారిటీ క‌నిపించ‌దు. విద్యార్థిగా, కంపెనీ సీఈఓగా, రైతుగా మ‌హేష్ ఇందులో మూడు పార్శ్యాలు ఉన్న పాత్ర‌ల్లో క‌నిపించారు. గ‌త చిత్రాల‌తో పోలిస్తే ఇందులో ఆయ‌న నటనలో రాటు దేలారు. ఎప్పటిలానే సహజంగా నటించి ఫ్రెండ్ పాత్ర‌లో అల్ల‌రి న‌రేష్‌ అలరించాడు. ఇక సాయికుమార్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, రాజీవ్ క‌న‌కాల, జ‌య‌సుధ‌, ప్ర‌కాష్‌రాజ్ లు తమ తమ పరిధి మేరకు నటించారు. పూజా హెగ్డే ఫ‌స్టాఫ్‌లోనూ, పాట‌ల్లోనూ గ్లామ‌ర‌స్‌గా క‌నిపించింది. సెకండాఫ్‌లో ఆమెకు పాత్ర‌కు పెద్ద‌గా స్కోప్ లేదు. కార్పొరేట్‌గా జ‌గ‌ప‌తిబాబు య‌థావిథిగా ఒదిగిపోయి న‌టించారు. క‌మ‌ల్ కామ‌రాజు పాత్ర కూడా బావుంది. క‌థ విష‌యానికి వ‌స్తే క్లైమాక్స్ లో రైతు స‌మ‌స్య‌ల‌ను విశ్లేషించిన తీరు బావుంది.
ఫైనల్ గా : లాజిక్స్ మిస్సయినా మ్యాజిక్ చేసిన మహర్షి
రేటింగ్ : 3.25/ 5