టీవీ9 రవిప్రకాష్ ఇళ్ళ మీదా ఆఫీస్ మీదా పోలీసుల దాడులు

టీవీ9 సీఈవో రవి ప్రకాష్ నివాసం, కార్యాలయంలో సైబర్ క్రైమ్ పోలీసులు సోదాలు కలకలంరేపాయి. టీవీ9కు సంబంధించిన ఓ కేసు విషయంలో ఈ సోదాలు జరిగినట్లు చెబుతున్నారు. రవి ప్రకాష్ తన సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ అలంద మీడియా కంపెనీ కార్యదర్శి కౌశిక్ రావు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారట. ఫోర్జరీ చేసి కొత్త డైరెక్టర్ల నియామకానికి రవి ప్రకాష్ అడ్డు తగులుతున్నారని ఆరోపించారట. దీంతో రవి ప్రకాష్‌ మీద సైబరాబాద్ సైబర్ క్రైమ్ పీఎస్‌లో రవి ప్రకాష్, తదితరులపై 406,467, ఐటీ యాక్ట్ 56 సెక్షన్ల కింద కేసు నమోదైనట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితమే ఏబీసీఎల్ కార్పొరేషన్ నుంచి అలంద మీడియా టీవీ9ను టేకోవర్ చేసిందట. అలాగే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో టీవీ9 యాజమాన్య కేసు విచారణ జరగనుందట. ఆ విచారణ నేపథ్యంలోనే సోదాలు చేసినట్లు తెలుస్తోంది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ లో టీవీ9 యాజమాన్య వివాదం మీద ఇప్పటికే నటుడు శివాజీ కేసు వేశారట. ఇదే వివాదం మీద ప్లస్ ఫైవ్ వెంచర్ కేపిటలిస్ట్ కంపెనీ తరపున కేసు కూడా నడుస్తోందట. అందుకే టీవీ9 ప్రధాన కార్యాలయం ముందు పోలీసులు భారీగా మోహరించారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.