టీవీ9 సీఈవోగా రవి ప్రకాష్ తొలగింపు ?

టీవీ9 సీఈవో పదవి నుంచి రవిప్రకాష్‌ను కొత్త యాజమాన్యం తొలగించినట్లు తెలిసింది. కొద్ది రోజుల కిందట ఏబీసీఎల్ కార్పొరేషన్ నుంచి టీవీ9ను అలంద మీడియా టేకోవర్ చేసింది. టీవీ-9లో రవిప్రకాష్‌ భారీ ఎత్తున కంపెనీ నిధులను దారి మళ్ళించాడని గుర్తించిన కొత్త యాజమాన్యం ఆయనను వైదొలగాలని కొన్నిరోజులుగా ఆదేశాలు జారీ చేసినా రవిప్రకాష్‌ పట్టించుకోలేదని సమాచారం. కొత్త యాజమాన్యం కంపెనీ ఆర్థిక లావాదేవీలపై అంతర్గత విచారణ జరిపినట్టు తెలిసింది. భారత్ వర్ష్ ఛానల్స్ వ్యవహారంలో రవిప్రకాష్‌ కోట్లు దారి మళ్ళించినట్లుగా నిర్ధారణకు వచ్చిన యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. టీవీ9లో 8శాతానికి పైగా వాటా ఉన్న రవిప్రకాష్ 90 శాతానికి పైగా వాటా ఉన్న కొత్త యాజమాన్యాన్ని ఇబ్బందిపెడుతున్నారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. మెజారిటీ వాటాదారుల హక్కులను రవిప్రకాశ్ కాల రాస్తున్నారని కొత్త యాజమాన్యం ప్రధానంగా ఆరోపిస్తోంది. కొత్త డైరెక్టర్ల నియామకానికి కూడా రవిప్రకాష్ అడ్డుతగులుతున్నారని యాజమాన్యం ఆరోపిస్తోంది. రవిప్రకాష్‌ కోసం రెండు రోజులుగా తెలంగాణ పోలీసుల గాలిస్తున్నట్లు తెలిసింది. రవిప్రకాష్‌ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నట్లు సమాచారం. అందువల్లే టీవీ9 కార్యాలయంలోనూ, తన నివాసంలోనూ సైబర్ క్రైం పోలీసులు సోదాలు చేసిన సందర్భంలో రవిప్రకాష్ అందుబాటులో లేనట్లు తెలిసింది.