వివాదాలకు ఆమడ దూరం ఉండే మహేష్‌బాబు, తన పని తాను చూసుకుంటాడు. ఇంతవరకు అతితక్కువ గాసిప్‌లు వచ్చిన స్టార్ హీరో అతనే అంటే నలుగురిలో ప్రవర్తన ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. అదీ కాక శ్రీమంతుడు అని ఒక సినిమా తీసి తన సొంత ఊరిని దత్తత తీసుకుని ఆదర్శంగా నిలిచాడు. అయితే అలాంటి మహేష్ బాబుకు ప్రభుత్వ పన్నుల శాఖ అధికారులు భారీ షాక్ ఇచ్చారు. మహేష్ బాబుకు చెందిన బ్యాంకు అక్కౌంట్లను సీజ్ చేశారు. ఇది మహేష్ అభిమానులకు షాకే కావచ్చు. కానీ గవర్నమెంటు చెప్పిన కారణం విస్మయానికి గురిచేసింది. స్టార్ హీరోగా అటు సినిమాలు, ఇటు ప్రకటనల్లో కోట్లు కూడబెడుతున్న మహేష్ పది సంవత్సరాలుగా సర్వీస్ ట్యాక్స్ కట్టలేదట.
ఒక స్టార్ హీరో ఇంత బాధ్యతారాహిత్యంగా ఎలా ఉన్నాడు అని జనం నోరెళ్లబెట్టే పరిస్థితి. ఈ సర్వీస్ టాక్స్ వలన మహేష్ బాబు పరువు డ్యామేజ్ అయ్యిందనే చెప్పాలి. ఆయన రెండు బ్యాంకు అకౌంట్లను జీఎస్టీ కమిషనరేట్ కార్యాలయం జప్తు చేసింది. గడచిన పదేళ్ళ నుంచి కట్టని సర్వీస్ ట్యాక్ బకాయిలను వాటిలోంచి రికవర్ చేశారట. ఇకమీదట నిబంధనలు పాటించకపోతే ఇక్కడితో వదిలేది లేదని వార్నింగ్ ఇచ్చి దీని మీద ఏకంగా ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. 2007-08లో పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా చేసిన మహేష్ వాటి ద్వారా వచ్చిన ఆదాయం మీద సర్వీస్ ట్యాక్స్ కట్టలేదట. అప్పటికే 18.5 లక్షలు బకాయిలుండగా ఆ తరవాత కూడా అలాంటి ఆదాయంపై ఆయన సర్వీస్ ట్యాక్స్ కట్టేలేదట. మొత్తం బకాయిలన్నీ కలిపితే రూ. 39 లక్షలు ఉంటాయని కమిషనరేట్ తెలిపింది. జరిమానాలతో కలిపి రూ. 73.5 లక్షలకు చేరాయట. అయితే వాటిని మొత్తం జప్తు చేసిన అకౌంట్లనుండి రికవర్ చేశారు.