Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాజకీయం, సినిమా ఎంత పని అయినా చేసేస్తాయి. తండ్రి కృష్ణ ఒకప్పుడు ఎంపీ అయినప్పటికీ సూపర్ స్టార్ మహేష్ కి రాజకీయాలంటే అసలు పడదు. వై.ఎస్ హవా సాగుతున్నప్పుడు కృష్ణ ద్వారా , టీడీపీ అధికారంలో వున్న ఇప్పుడు బావ గల్లా జయదేవ్ ద్వారా మహేష్ ని పొలిటికల్ సీన్ లోకి తీసుకురావడానికి గట్టి ప్రయత్నాలే సాగాయి . అయినా మహేష్ ఎప్పుడూ ఆ దిశగా అడుగులు వేయలేదు. ఇక వెండితెర సింహాసనం కోసం తనతో పోటీపడుతున్న పవన్ కళ్యాణ్ రాజకీయంగా యాక్టివ్ అవుతున్నప్పటికీ మహేష్ తొందరపడలేదు. బాగా సంయమనంతో వ్యవహరించారు. బావ గల్లా జయదేవ్ గుంటూరు ఎంపీ గా పోటీ చేసినప్పుడు మాత్రం మహేష్ ఆయనకి ఓటు వేయమని సోషల్ మీడియా ద్వారా అభ్యర్ధించారు. అది కూడా ఆ మెసేజ్ లో ఎక్కడా టీడీపీ అభ్యర్థి అని రాకుండా చూసుకున్నారు మహేష్. రాజకీయాలంటే అంత దూరంగా వుండే మహేష్ కి ఇప్పుడు అసెంబ్లీ లో అడుగు పెట్టక తప్పలేదు.
అయితే ఇప్పుడు సీన్ మారింది. మహేష్ తనంతట తానే అసెంబ్లీలోకి అడుగు పెట్టడానికి తహతహలాడుతున్నారు. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అసెంబ్లీ లోకి వెళదామా అని ఎదురు చూస్తున్నారు. ఔను ఇది నిజంగా నిజం. కాకుంటే ఆయన అడుగు పెడుతోంది అసెంబ్లీలోకి కాదు. అసెంబ్లీ సెట్ లోకి. రాజకీయాలకు దూరంగా వుండే మహేష్ ని ఓ రాజకీయ నేపధ్యం వున్న కథతో ఒప్పించాడు దర్శకుడు కొరటాల శివ. “భరత్ అను నేను ” అనే టైటిల్ తో చేస్తున్న ఈ సినిమా షూటింగ్ కోసం అసెంబ్లీ సెట్ వేశారు. అందులోకి మహేష్ అడుగుపెట్టే సన్నివేశాలు షూటింగ్ జరుగుతోంది. అందుకోసం మహేష్ అసెంబ్లీకి అడుగుపెడుతున్నారు. అదీ ఆసెంబ్లీలోకి మహేష్ వెళ్లడం వెనుక కారణం.