ఆ బామ్మను కలిసిన మహేష్‌బాబు

Mahesh Babu Meets Satyavati In Rajahmundry

మహేష్‌బాబును చూడాలని, ఒక ఫొటో దిగాలని 106 ఏళ్ల బామ్మ సత్యవతి కోరుకుంటున్నట్లుగా కొన్ని రోజుల క్రితం మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. మీడియాలో వార్తలు వచ్చిన సమయంలో అమెరికాలో ఉన్న మహేష్‌ బాబు తప్పకుండా ఆమెను కలుస్తాను, హైదరాబాద్‌లో ఆమెతో కలిసి ఫొటో దిగుతాను అంటూ హామీ ఇచ్చాడు. తాజాగా అన్నట్లుగానే మహేష్‌బాబు ఆ బామ్మను స్వయంగా పిలిపించుకుని, ఆమెతో మాట్లాడి ఆమెను ఆనందింపజేశాడు. తాజాగా రామోజీ ఫిల్మ్‌ సిటీలో మహర్షి చిత్రీకరణలో పాల్గొంటున్న మహేష్‌బాబు తన వృద్ద అభిమాని సత్యవతిని అక్కడికే పిలిపించుకున్నాడు. ఆమెతో చాలా సమయం మాట్లాడటంతో పాటు, ఆమె గురించి అడిగి తెలుసుకున్నాడు.

mahesh babu meets

రాజమండ్రి నుండి ప్రత్యేకంగా కారులో ఆమెను బై రోడ్డు తీసుకు వచ్చారు. మహేష్‌బాబు అభిమానులు స్వయంగా ఆమెను వెంట పెట్టుకుని రావడంతో మహేష్‌బాబు వారిని అభినందించాడు. సత్యవతి గారి కోరిక తీర్చిన మహేష్‌బాబు ఆమెకు కొత్త బట్టలు పెట్టి, సెట్‌లోనే బోజనం పెట్టించాడు. మహేష్‌బాబు ఆత్మీయంగా ఆమెను ఆధరించడం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. మహేష్‌బాబుతో ఫొటో దిగాలన్న ఆమె బలమైన కోరిక తీరడంతో ఆ శతాధిక వృద్దురాలు ఎంతో సంతోషంగా ఉంది. మహేష్‌ను కలిసిన ఆమె మళ్లీ రాజమండ్రి తిరుగు ప్రయాణం అయ్యింది. ఇక మహేష్‌బాబు తన ‘మహర్షి’ చిత్రాన్ని వచ్చే వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెల్సిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం మహేష్‌కు 25వ చిత్రం అవ్వడంతో ఫ్యాన్స్‌ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.