నోబ్‌ల్ శాంతి బహుమతి గ్రహిత, మానవ హక్కుల న్యాయవాది మలాలా యూసఫ్‌జాయ్ వాషింగ్టన్ పర్యటన సందర్భంగా అఫ్గాన్ బాలికలకు, మహిళలకు బలమైన యూఎస్ మద్దతు కావాలని తెలిపారు. అంతేకాదు ప్రస్తుతం బాలికలకు సెకండరీ విద్య అందుబాటులో లేని ఏకైక దేశం అఫ్ఘనిస్తాన్ అని, పైగా వారు విద్యనభ్యసించకుండా నిషేధించారంటూ యూఎస్ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో జరిగిన సమావేశంలో మలాలా తన ఆవేదనను వ్యక్తం చేశారు.
ఈ మేరకు ఈ సమావేశంలో మలాల సోటోడా అనే అఫ్గాన్ అమ్మాయి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కి రాసిన లేఖను ప్రస్తావిస్తూ ‘ఇది అఫ్గాన్ బాలికల సందేశం. బాలికలందరికీ సురక్షితమైన మరియు నాణ్యమైన విద్యను పొందగలిగే ప్రపంచాన్ని మేము చూడాలనుకుంటున్నాం’ అని రాసిన లేఖను బ్లింకెన్‌కి అందజేశారు. అంతేకాదు తమను ఎంతకాలం పాఠశాలలకు, విశ్వవిద్యాలయాలకు దూరం చేస్తారో అంతలా తమ భవిష్యత్తుపై ఆశ చిగురిస్తూనే ఉంటుందని సోటోడా లేఖలో ప్రస్తావించిన విషయాన్ని మలాలా పేర్కొన్నారు.
ఈ మేరకు దేశంలో శాంతి భద్రతలను తీసుకురాగలిగే అతి ముఖ్యమైన సాధనం బాలికల విద్య అని, అమ్మాయిలు చదువుకోకపోతే అఫ్ఘాన్ నష్టపోతుందంటూ ఆవేదనగా పేర్కొంది. అయితే అఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి బాలికలు విద్యనభ్యసించకూడదంటూ పలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మలాలా యునైటెడ్ స్టేట్స్, యుఎన్‌తో కలిసి అఫ్ఘాన్‌లోని బాలికలు వీలైనంత త్వరగా తమ పాఠశాలలకు తిరిగి వెళ్లేలా చూసేందుకు తక్షణ చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.