ఓట్ల లెక్కింపు మీద…హైకోర్టును ఆశ్రయించిన మల్‌రెడ్డి…!

Malreddy Ranga Reddy Appeal In High Court

ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఓట్లకు సంబంధించిన అన్ని వీవీ ప్యాట్‌ స్లిప్పులను లెక్కించేలా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో)ని ఆదేశించాలని కోరుతూ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి బీఎస్‌పీ తరఫున పోటీ చేసి 376 ఓట్ల తేడాతో ఓటమిపాలైన రంగారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 11న ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా, ఆ ఓట్ల లెక్కింపులో లోపాలపై తమ ఎన్నికల ఏజెంట్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తూ రిటర్నింగ్‌ అధికారికి వినతిపత్రం సమర్పించారని రంగారెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ వినతి పత్రం తీసుకుంటున్నట్లు రిటర్నింగ్‌ అధికారి ఎటువంటి అక్నాలెడ్జ్‌మెంట్‌ ఇవ్వలేదని మాక్‌ పోలింగ్‌ డేటాను తుడిచేయకుండా వీవీ ప్యాట్‌లను లెక్కించడం వల్ల సమస్య వచ్చిందని రిటర్నింగ్‌ అధికారి చెప్పారని దీనిపై సీఈవోను కలిసి వీవీ ప్యాట్‌ స్లిప్పులను లెక్కించాలని అభ్యర్థిస్తూ వినతిపత్రం ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. పోలింగ్‌ పారదర్శకంగా జరిగేందుకు వీవీ ప్యాట్‌లను తీసుకువచ్చారని, అయితే అధికారులు మాత్రం పారదర్శకంగా వ్యవహరించడం లేదని రంగారెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోర్టును అభ్యర్థించారు. ఈ అంశం గురించి రంగారెడ్డి తరఫున హాజరైన సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది రాకేష్‌ ముంజాల్‌ ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ తొట్టతిల్‌ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ముందు ప్రస్తావించారు. తమ అభ్యర్థన గురించి ధర్మాసనానికి వివరించారు. విచారణను ఈ నెల 26కి వాయిదా వేసింది. తాము ఇచ్చిన ఈ ఆదేశాల గురించి అవినాశ్‌కు తెలియచేయాలని అక్కడే ఉన్న ప్రభుత్వ న్యాయవాదులకు సూచించింది.