Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మొహర్రం రోజున దుర్గామాత విగ్రహాల ఊరేగింపుపై నిషేధం విధించి హైకోర్టు తో చివాట్లు తిన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పై దేశవ్యాప్తంగా విమర్శలు చెలరేగిన సంగతి తెలిసిందే. సెక్యులరిజం పేరుతో ఆమె హిందూమతాన్ని అవమానిస్తోందని పలువురు ఆక్షేపించారు. ఈ నేపథ్యంలో హిందూ మతానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారంటూ తనపై వస్తున్న విమర్శలు తిప్పికొట్టడానికో..లేక పాత సంప్రదాయాన్ని కొనసాగించే ఉద్దేశమో తెలియదు కానీ….మమత దుర్గాపూజ కోసం ఓ పాట రాసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. పశ్చిమ బెంగాల్ లో సురుచి సంఘ వారి దుర్గాపూజ ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది. ఇప్పుడు ఆ రాష్ట్రంలో దుర్గా పూజ కోసం థీమ్ సాంగ్ లు పాడడం ట్రెండ్ గా మారింది. ఈ ట్రెండ్ కు తగ్గట్టుగా మమతా బెనర్జీ కూడా సురుచి సంఘ వారి పూజకోసం థీమ్ సాంగ్ రాశారు. ఈ పాటతో వీడియో కూడా విడుదలయింది. ప్రముఖ సంగీత దర్శకుడు జీత్ గంగూలీ పాటకు స్వరాలు సమకూర్చగా…బాలీవుడ్ గాయకురాలు శ్రేయాఘోషల్ మమత పాటను ఆలపించారు. బోయి చిత్రోర్ ముక్తే అంటూ ప్రారంభమయ్యే ఈ పాట వీడియో లింక్ ను మమతా బెనర్జీ సోషల్ మీడియా ఎకౌంట్ లో షేర్ చేశారు. గతంలో కూడా మమతాబెనర్జీ దుర్గా పూజ కోసం పాటరాశారు.