Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నవంబర్ 8… 2016 భారత దేశ ఆర్థిక చరిత్రలో మర్చిపోలేని రోజు. నల్లధనానికి వ్యతిరేకంగా కేంద్రప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకుంది ఈరోజే. రూ. 500, రూ.1000 నోట్లను రద్దుచేస్తూ కేంద్రం తీసుకున్న సంచల నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థను ఓ కుదుపు కుదిపింది. తమ దగ్గర ఉన్న పెద్ద నోట్లను మార్చుకునేందుకు సామాన్యులు బ్యాంకులకు క్యూకట్టారు. గంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షించి… నోట్లను మార్చుకునేందుకు సామాన్య ప్రజలు పడ్డ బాధలు అన్నీ ఇన్నీ కావు… క్యూలైన్ల దగ్గర జరిగిన ఘర్షణల్లో, పోలీసుల లాఠీచార్జ్ లో, ఎండ వేడమి తాళలేక… నీరసించిపోయి… కొందరు ప్రాణాలు కోల్పోయిన విషాదాలూ చోటుచేసుకున్నాయి. అయినా సరే ప్రజలు మోడీ నిర్ణయానికి మద్దతు పలికారు. ఆ నిర్ణయంతో తమ జీవితాల్లో సానుకూల మార్పులు వస్తాయని నమ్మారు. అక్రమార్కుల సంపాదనను వెలికితీసి… ఆ ధనంతో మోడీ తమ బతుకులను బాగుచేస్తారని పేదలు ఆశలుపెట్టుకున్నారు. కానీ ఇదేమీజరగలేదు.
నోట్లు మార్చుకునేందుకు సాధారణ ప్రజలు అష్టకష్టాలు పడుతోంటే… అక్రమార్జనకు కేరాఫ్ అడ్రస్ అయిన వారు మాత్రం దర్జాగా నోట్ల మార్పిడి చేసుకున్నారు. లెక్కలు లేని సంపాదన వృథాగా మారుతుందనుకుంటే… అదంతా బ్యాంక్ ఖాతాల్లో వచ్చి పడింది. ఇదంతా జరిగి ఏడాది గడుస్తున్నా… ఇంకా నోట్ల కష్టాలు పూర్తిగా తీరలేదు. పెద్ద నోట్ల రద్దుతో మోడీ చెప్పిన అద్భుతాలు ఏవీ జరగవని ఇప్పుడిప్పుడే దేశ ప్రజలు అర్ధంచేసుకుంటున్నారు. ఈ క్రమంలో మోడీపైనా, కేంద్రప్రభుత్వంపైనా ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. ఒకప్పుడు మోడీ నిర్ణయాన్ని సమర్థించిన వారే… ప్రతికూల ఫలితాలను చూసి మోడీపై దుమ్మెత్తిపోస్తున్నారు. సొంతపార్టీలోనూ మోడీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న వారు బహిరంగ విమర్శలకు దిగుతున్నారు. ఇక విపక్షాల సంగతి సరేసరి.
నోట్లరద్దు, జీఎస్టీ నిర్ణయాలపై దేశవ్యాప్తంగా పెరుగుతున్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మోడీ విధానాలను ఎండగడుతూ… విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే నోట్ల రద్దు నిర్ణయం తీసుకుని సంవత్సరం గడుస్తున్న సందర్భంగా… నవంబర్ 8న నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని విపక్షపార్టీలన్నీ నిర్ణయించాయి. ఆ రోజును బ్లాక్ డేగా పాటించి… రాష్ట్ర వ్యాప్తంగా నల్ల జెండాలతో నిరసన తెలుపుతామని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ వెల్లడించారు. కాంగ్రెస్, ఆ పార్టీ మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరసనలు జరగనున్నాయి.
ఈ నేపథ్యంలో విపక్షాల చర్యలకు దీటుగా నవంబర్ 8న బీజేపీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నల్లధన వ్యతిరేక దినం జరుపుతామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. బీజేపీ నాయకులంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని, నల్లధనానికి వ్యతిరేకంగా తీసుకున్న చర్యలను ప్రజలకు వివరిస్తామని చెప్పారు. అధికారపక్షం, విపక్షాల విమర్శలు, ప్రతివిమర్శల సంగతి పక్కనపెడితే… నోట్ల రద్దు వల్ల సామాన్యులు అనేక కష్టాలుపడిన మాట వాస్తవం. ఆ బాధలు మర్చిపోవాలంటే… మోడీ ప్రభుత్వం తమ నిర్ణయం వల్ల కలిగిన సానుకూల ఫలితాలు ఏమైనా ఉంటే వాటిని సామాన్యులకు సైతం అర్ధమయ్యేలా చెప్పాలి. అప్పుడే ఈ వ్యతిరేకత తొలగిపోతుంది.