తెలంగాణ లో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ ప్రాంతంలో ఎంతోమంది జల దిగ్బంధం లో ఉండిపోయారు. భారీ వరదలతో చాలా మంది నగర వాసులు నిరాశ్రయులయ్యారు. అయితే నిరాశ్రయులైన వారి కొరకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తన వంతుగా భారీ సహాయమును అందజేసింది. వరద ప్రభావానికి గురి అయిన ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం రెండు కోట్ల రూపాయల ఆర్థిక సహాయం ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రకటించింది.
అయితే ఈ మేరకు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కి లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రం లో భారీ వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులకు గురి కావడం అత్యంత బాధాకరం అని పేర్కొన్నారు. అంతేకాక వరదల కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు మమత బెనర్జీ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అయితే ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పశ్చిమ బెంగాల్ ప్రజలు అండగా ఉంటారు అని మమతా లేఖలో పేర్కొన్నారు. మమత బెనర్జీ ప్రకటించిన సాయానికి సీఎం కేసీఆర్ ఫోన్ కాల్ ద్వారా మాట్లాడి, కృతజ్ఞతలు తెలియజేశారు. భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ వాసులు ఇబ్బందులు పడటం తో రాజకీయ నాయకులు, సినీ పరిశ్రమ కి చెందిన ప్రముఖులు తమ వంతు సాయం గా విరాళాలు అందజేస్తున్నారు.