ఈరోజు ఢిల్లీలోని కేరళ భవన్ వద్ద ఒక్కసారిగా కలకలం రేగింది. చేతిలో కత్తి, షర్టు జేబుకి జాతీయ జెండా మరో చేతిలో కొన్ని పేపర్లతో వచ్చిన వ్యక్తి లోపలి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అందుతున్న సమాచారం ప్రకారం కేరళ సీఎం విజయన్ ని కలిసేందుకు కేరళ లోని కరిప్పుజా ప్రాంతానికి చెందిన విమల్ రాజ్ అనే వ్యక్తి అక్కడికి చేరుకున్నాడు. మెయిన్ గేట్ సెక్యూరిటీ కళ్లు గప్పి ఎలాగోలా లోపలికి ప్రవేశించాడు. అయితే ఆవరణలోని అధికారులు అతన్ని అడ్డుకునే సరికి లోపలికి అనుమతించాలంటూ వారితో వాగ్వాదానికి దిగాడు. నెలరోజులుగా ఓ కేసు నిమిత్తం తాను సీఎంను కలిసేందుకు యత్నిస్తున్నానని, కానీ, ఆ పని జరగట్లేదని ఇప్పుడు తనని ఆపితే కనుక సూసైడ్ చేసుకుంటానని బెదిరిస్తుండగా అధికారులు అతన్ని వెనకాల నుంచి వెళ్లి చాకచక్యంగా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు.
ఆయన్ని అదుపులోకి తీసుకుని పోలీసులకి అప్పగించగా ఆయన్ని వారు మానసిక విద్యాలయానికి తరలించి అక్కడ పలు టెస్టులు చేయించారు. అయితే విమల్‌కు మతిస్థిమితం సరిగ్గాలేదని, అతని చేతిలో ఉన్న పేపర్లు అతని మెడికల్ రిపోర్ట్‌లేనని అధికారులు తరువాత వెల్లడించడం గమనార్హం. ఘటన జరిగిన సమయంలో సీఎం విజయన్ లోపలే ఉన్నారు. తన వ్యాపరం ఇప్పుడు సరిగా సాగడం లేదని రోజుకు ఐదారు వందలు కూడా గిట్టుబాటు కావడంలేదని అందుకే సీఎంను కలిసి చచ్చిపోతానని చెప్పడం అతని మానసిక స్థితి మీద పలు అనుమానాలు రేకెత్తిస్తోంది.