తొలుత ప్రేమపేరుతో తల్లిని చేసి తర్వాత పెళ్లిపేరుతో నాటకమాడి పరారయ్యాడని దళితయువతి మౌనిక కన్నీటిపర్యంతమైంది. చిత్తూరులోని ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. పూతలపట్టు మండలం మద్దలయ్యగారిపల్లె దళితవాడకు చెందిన మౌనిక ఏడాది కిందట బంగారుపాళ్యంలోని ఓ ప్రైవేటు ఫ్యాక్టరీలో పనిచేసేటప్పుడు బంగారుపాళ్యం మండలం వెలుతురుచేనుకు చెందిన వినోద్ పరిచయమయ్యాడు. ప్రేమపేరుతో కలిసి తిరిగారు.మౌనిక గర్భం దాల్చడంతో వినోద్ మాత్రలు ఇచ్చి అబార్షన్ చేయించాడు.
మళ్లీ రెండోసారి గర్భం దాల్చడంతో వీరి ప్రేమ వ్యవహారం బాధితురాలి ఇంట్లో తెలిసింది. వారి కుటుంబసభ్యులు నిలదీయగా ఈ ఏప్రిల్ 17వ తేదీన బంగారుపాళ్యం మండలం నలగలంపల్లె వెంకటేశ్వరస్వామి ఆలయంలో పెళ్లి చేసుకున్నాడు. వారం పాటు మౌనిక ఇంటికొచ్చి ఉండి.. తర్వాత పనికి వెళ్తానని చెప్పి వినోద్ పరారయ్యాడు. ఈ క్రమంలో మౌనిక జూన్ 4వ తేదీన ఓ పాపకు జన్మనిచ్చింది. బిడ్డతో వినోద్ ఇంటికి వెళ్తే.. అత్తామామలు రానివ్వలేదు. దీంతో న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేదని బాధితురాలు వాపోయింది. ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని వేడుకుంది.