రెండో పెళ్లికి సిద్ధపడిన భర్త ఇంటి ముందు యువతి దీక్షకు దిగిన ఘటన నారాయణవనం మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. బాధితురాలి కథనం మేరకు.. చెన్నైకి చెందిన శ్రీదేవి మండలంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో సెక్యూరిటీ విభాగంలో పనిచేస్తోంది. నారాయణవనం మండలం బీసీ కాలనీకి చెందిన రామచంద్రన్ కమ్యూనిటీ పోలీస్‌గా ఉంటూ అదే కాలేజీలో బస్సు డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో రామచంద్రన్ హోంగార్డుగా ఎంపికయ్యాడు.
గత ఏడాది మార్చి 13న నాగలాపురంలో శ్రీదేవిని పెళ్లి చేసుకుని తిరుపతిలో కాపురం పెట్టాడు.మూడు నెలల క్రితం వివాహం విషయం తెలుసుకున్న రామచంద్రన్ తల్లిదండ్రులు అతన్ని ఇంటికి తీసుకెళ్లారు. అందరినీ ఒప్పించేవరకు ఆగాలని చెప్పిన రామచంద్రన్ మాటలను శ్రీదేవి నమ్మింది. అద్దె కట్టలేని పరిస్థితి రావడంతో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లోకి చేరింది. క్రమంగా భర్త నుంచి సమాచారం రాకపోవడంతో నీతి నిజాయతీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అరవ చిట్టిబాబును ఆశ్రయించింది.
ఆదివారం ఉదయం పార్టీ మహిళా విభాగం నాయకులతో కలిసి స్థానిక బీసీ కాలనీలో నివాసముంటున్న రామచంద్రన్ ఇంటి ముందు దీక్షకు దిగింది. సమాచారం అందుకున్న ఎస్ఐ ప్రియాంక శ్రీదేవికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో సాయంత్రానికి దీక్షను విరమించింది. తన భర్త రామచంద్రన్‌ను తనతో కలవకుండా అడ్డుకోవడమే కాకుండా మరో పెళ్లి చేయడానికి అత్తమామలు ప్రయత్నాలు ప్రారంభించారని శ్రీదేవి చేసిన ఫిర్యాదుతో రామచంద్రన్, అతని తల్లిదండ్రులను విచారిస్తున్నామని, శ్రీదేవికి న్యాయం చేస్తామని ఎస్ఐ ప్రియాంక తెలిపారు.