నిందితులు అరెస్ట్‌ చేసిన పోలీసులు

అపహరణకు గురై హత్యగావించబడిన సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ సిలివేరు రామాంజనేయులు కేసులో ఇద్దరు నిందితులను పట్టణ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. గతేడాది నుంచి తమ సోదరుడు కన్పించకుండా పోవటానికి ఆంజనేయులే కారణమని భావిస్తూ నిందితులు అతడిని అపహరించి హత్య చేయటం గమనార్హం. డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో హత్య వివరాలను డీఎస్పీ సి.విజయభాస్కరరావు విల్లడించారు. మండలంలోని జొన్నలగడ్డ గ్రామానికి చెందిన రామాంజనేయులు పట్టణంలోని కాకుమాను బజారులోగల కల్యాణ్‌ సర్వీసింగ్‌ సెంటర్‌లో సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు.

పట్టణానికే చెందిన జంగం బాజి, జంగం రామయ్యలు తమ సోదరుడు జంగం చంటి గతేడాది సెప్టెంబరు నుంచి కన్పించకుండా పోవటంతో చంటితో పరిచయం ఉన్న రామాంజనేయులుకు తెలిసి, అతని ప్రమేయం ఉంటుందని భావించారు. వీరు మరో ముగ్గురు వ్యక్తులను కలుపుకొని శనివారం మృతుడు ఆంజనేయులు పనిచేసే కల్యాణ్‌ సర్వీసింగ్‌ సెంటర్‌ వద్దకు వచ్చి ఫోన్‌ ద్వారా బయటకు పిలిచారు. బయటకు వచ్చిన ఆంజనేయులును కొట్టుకుంటూ బలవంతంగా ఆటోలో ఎక్కించుకొని అపహరించారు. దీనిపై అతని భార్య సిలివేరు ప్రసన్న తన భర్తను జంగం బాజీ మరికొందరు కలిసి అపహరించినట్లుగా పట్టణ వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీనిపై ఎస్పీ వై.రవిశంకర్‌రెడ్డి కేసును చేధించేందుకు మూడు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. కేసులో ప్రధాన నిందితులైన జంగం బాజి, రామయ్యలను అదుపులోకి తీసుకొని విచారించగా వారు మరో ముగ్గురితో కలిసి రామాంజనేయులను అపహరించి హత్యచేసినట్లుగా నేరాన్ని అంగీకరించారన్నారు. రామాంజనేయులను ఆటోలో పట్టణ రింగ్‌రోడ్డు మార్గం గుండా పాలపాడు, రావిపాడు, ఇసప్పాలెం, జొన్నలగడ్డ, సాతులూరు మీదుగా నాదెండ్ల శివారులో గల నిర్మానుష్యమైన యడ్లపాడు వాగు వద్దకు తీసుకెళ్లి కర్రలతో కొట్టి చంటి గురించి అడిగారు.

రాయపాటి వెంకన్న, నాగూర్‌బాష అలియాస్‌ బిల్లా ఇరువురు చంటిని విజయవాడ వద్ద హత్యచేసినట్లుగా రామాంజనేయులు తమకు చెప్పినట్లు నిందితులు చెప్పారని డీఎస్పీ వెల్లడించారు. రామాంజనేయులను వాగులోకి త్రోసి ఊపిరాడకుండా చేసి చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత మృతదేహాన్ని ప్లాస్టిక్‌ గోతంలో మూటకట్టి ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెం కల్వర్టు వద్ద పడేశారన్నారు. నిందితులు ఇచ్చిన ఆచూకీతో మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించామన్నారు. ఈ కేసులో మిగతా ముగ్గురు నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని డీఎస్పీ చెప్పారు.