కరోనాతో ఉపాధి లేక ఓ వ్యక్తి ఆకలితో మృతి చెందిన సంఘటన పట్టణంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఎల్లారెడ్డి మండలంలోని అన్నాసాగర్ గ్రామానికి చెందిన బద్దారం కిష్టయ్య(40) గత కొద్ది సంవత్సరాలుగా పట్టణంలోని ఓ హోటల్లో పని చేస్తు జీవిస్తున్నాడు. ప్రస్తుతం కరోనా వ్యాపిస్తుండడంతో హోటల్ నిర్వహణ సరిగా లేక పోవడంతో దొరికిన చోట పని చేస్తు జీవిస్తున్నాడు.
పట్టణంలో ఇటీవల వైరస్ ఉధృతి పెరగడంతో గత నెల 24 నుంచి 31 వరకు పూర్తిగా లాక్డౌన్ ఉండడంతో ఎక్కడ పని దొరకక, హోటల్ నడవక పోవడంతో ఆకలిని తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. ప్రతి రోజు ప్రభుత్వ ఆస్పత్రి పాత భవనం వద్ద పడుకునే వాడని స్థానికులు తెలిపారు. ఆదివారం ఉదయం వరకు కిష్టయ్య నిద్ర లేవక పోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు మృతుడి అన్నదమ్ములకు సమాచారం అందించడంతో వారు వచ్చి కిష్టయ్య మృత దేహాన్ని తీసుకుని వెళ్లారు. అన్నాసాగర్ గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.