ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం ప్రజలకు ప్రాణసంకటంగా పరిణమించింది. అధికారుల అలసత్వం అమాయకులకు గండంగా మారింది. రహదారిని వరదనీటి కాలువగా మార్చడం ఓ వ్యక్తి గల్లంతుకు కారణమైంది. స్కూటీపై ఆ రహదారిని దాటే క్రమంలో ఓ వ్యక్తి వరదనీటిలో కొట్టుకుపోయాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి హైదరాబాద్ సరూర్‌నగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. బాలాపూర్ మండలం అల్మాస్‌గూడకు చెందిన నవీన్‌కుమార్(32) ఎలక్ట్రీషియన్.
సరూర్‌నగర్ చెరువుకట్ట కింద నుంచి తపోవన్ కాలనీ మీదుగా సరూర్‌నగర్ గాంధీ విగ్రహం చౌరస్తా వైపు స్కూటీపై బయలుదేరాడు. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తపోవన్ కాలనీ రోడ్ నంబర్–6 నుంచి చెరువులోకి వడిగా వరదనీరు ప్రవహిస్తోంది. వరద నీటిని దాటే క్రమంలో స్కూటీ అందులో కొట్టుకుపోయింది. అనంతరం నవీన్‌కుమార్ కూడా వరదలో కొట్టుకుపోయి చెరువులో గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న స్థానిక కాలనీవాసులు కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు వచ్చి నవీన్‌కుమార్ ఆచూకీ తెలుసుకునేందుకు గజ ఈతగాళ్లను, అధునాతన బోట్లను రంగంల్లోకి దించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
లింగోజిగూడ డివిజన్ పరిధిలోని ఎగువ ప్రాంతాలైన భాగ్యనగర్, విజయపురి, ధర్మపురి, సాయినగర్, శ్రీరాంనగర్, బైరామల్‌గూడ చెరువు నుంచి వచ్చే వరదనీరు సాఫీగా సరూర్‌నగర్ మినీ ట్యాంక్‌బండ్‌లోకి వెళ్లేందుకు తపోవన్ కాలనీ రోడ్ నంబర్ 6 ను మూడేళ్ల క్రితం సర్కిల్ అధికారులు నాలాగా మార్చారు. ఈ క్రమంలో సరూర్‌నగర్ చెరువుకు గండి పెట్టి వరదనీటిని చెరువులోకి మళ్లించి చేతులు దులుపుకున్నారు. ఈ నేపథ్యంలో చిన్న చినుకు పడినా రహదరిపై వరద ఏరులై పారుతోంది. వరదనీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించకుండా రహదారిని నాలాగా మార్చడంతో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారుల అలసత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.