కరోనా.. సామాజిక దూరం తెచ్చిన తంటా…వ్యక్తి హత్య

కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా వీరవిహారం చేస్తుంది. ఈ వేగాన్ని నిలువరించేందుకు ఇంట్లో ప్రతిఒక్కరి వారి వారి ఇళ్లలో ఉండటమే ఉత్తమమైన మార్గంగా ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ఇదే సమయంలో ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు సామాజిక దూరాన్ని పాటించడం ఒక్కటే మార్గం. మరొక మార్గం లేదు. అయితే ఇదే సామాజిక దూరాన్ని పాటించేందుకు నిరాకరించిన ఓ 40 ఏళ్ల వ్యక్తి తాజాగా ఊటీలో హత్యకు గురయ్యాడు. అయితే నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

అసలేం జరిగిందంటే.. ఎన్ దేవదాస్ అనే చిరు తినుబండారాల వ్యాపారి..  రోజువారీ కూలీ కార్మికుడైన ఆర్ జోతిమణిని పొడిచి చంపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యాహ్నం దేవదాస్ ఒక కప్పు టీ కోసం నడుస్తున్నప్పుడు.. జోతిమణి భోజనం చేస్తున్నాడు. జోతిమణి.. దేవదాస్‌ను దూరంగా జరగమని కోరినప్పుడు ఇద్దరి మధ్య గొడవ జరిగిందని పోలీసులు తెలిపారు. దేవదాస్ అందుకు నిరాకరించడంతో.. జోతిమణి అతనిని చెంపదెబ్బ కొట్టాడు. నిరాశతో.. దేవదాస్ కత్తిని తీసుకొని, జోతిమణిని పొడిచినట్లు తెలుస్తోంది. ఆసుపత్రికి తీసుకెళ్తుండగా.. దారిలో జోతిమణి మృతి చెందాడు. శవపరీక్ష తర్వాత మృతదేహాన్ని మృతుడి కుటుంబానికి అప్పగించారు. నిందితుడిపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 302 కింద కేసు నమోదైంది. కాగా విచారణ తర్వాత దేవదాస్ ను జ్యుడీషియల్ కస్టడీలో రిమాండ్ చేయనున్నట్లు పోలీసులు వెల్లడించారు.