కరోనా నివారణ కోసం ఎంపీ బీబీ పాటిల్‌ ఆర్థిక సాయం

కరోనా నివారణ కోసం ఎంపీ బీబీ పాటిల్‌ ఆర్థిక సాయం

కరోనా వైరస్ నివారణ కోసం జహీరాబాద్‌ టీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్‌ పెద్ద మొత్తంలో ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. తన ఎంపీ నిధుల నుంచి రూ.1.01 కోట్లు కేటాయిస్తున్నట్లుగా ప్రకటించారు. అయితే, జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని జిల్లాలకు ఈ సాయం ఇస్తున్నట్లుగా ఆయన వివరించారు. మొత్తం రూ.1.01 ఆర్థిక సాయంలో జహీరాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్న సంగారెడ్డి జిల్లాకు రూ.50 లక్షలు, కామారెడ్డి జిల్లాకు రూ.51 లక్షల చొప్పున వర్తించనున్నట్లుగా ప్రకటించారు. తన ఎంపీ ల్యాడ్ నిధుల నుంచి ఈ మొత్తాన్ని ఖర్చు చేయాలని సంగారెడ్డి, కామారెడ్డి కలెక్టర్లకు ఎంపీ బీబీ పాటిల్‌ లేఖ రాశారు.

తాను ప్రకటించిన ఈ నిధులతో జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో కొవిడ్-19 నిరోధానికి చేపడుతున్న చర్యలకు అవసరమైన యంత్రాంగానికి ఖర్చు చేయాలని బీబీ పాటిల్ లేఖలో కోరారు. అంతేకాక, ఆస్పత్రిలో కరోనా వైరస్ రోగుల చికిత్స కోసం అవసరమయ్యే యంత్రసామగ్రి, తదితరాల కోసం ఖర్చు చేయాల్సిందిగా బీబీ పాటిల్ కోరారు.

అంతేకాక, ఆదిలాబాద్ జిల్లా లాండ సాంగ్వి గ్రామానికి చెందిన మోర హనుమాండ్లు అనే రైతు కరోనా నివారణ సహాయం కోసం రూ.50 వేల విలువైన చెక్కును ఆ జిల్లా కలెక్టర్‌ శ్రీదేవసేనకు అందించారు. కరోనా వైరస్‌ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలు కఠినమైన నిబంధనలు, చర్యలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు పలువురు ప్రముఖులు తమ వంతుగా స్వచ్ఛందంగా విరాళాలు అందిస్తున్నారు.