చెల్లిని చంపిందని తల్లిని కొడుకు హత్య

చెల్లిని చంపిందని తల్లిని కొడుకు హత్య

తన చెల్లిని చంపేసిందని కన్నతల్లిని కొడుకు హత్య చేశాడు. ఈ దారుణ ఘటన కడప నగరంలో చోటు చేసుకుంది. నకాష్ వీధిలో జంట హత్యలు కలకలం రేపాయి. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. వివరాలు సేకరించారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను కడప రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు.

ఈ దారుణ ఘటన పూర్తి వివరాలు ఇలా.. నకాష్ వీధిలో నివాసం ఉంటున్న కుషిదా తన కూతురు అలీమా నిత్యం ఫోన్ చూస్తుందని కోపగించింది. ఆమె మెడకు చున్నీ వేసి బెదిరించే యత్నం చేయగా.. పొరపాటున ఉరి బిగిసుకుని కూతురు మరణించింది. ఈ సంఘటన చూసిన కొడుకు.. తల్లిని కత్తితో పొడచి హత్య చేశాడు.

పోలీసులు హత్య జరిగిన ప్రదేశానికి చేరుకుని కుషిదా మెడపై కత్తి గాట్లు ఉన్నట్లు గుర్తించారు. ఆమె బంధవులను విచారించగా.. కొడుకు ఉన్నాడని అతడు కనిపించడం లేదని చెప్పారు. పోలీసులు అతడిని గాలించి పట్టుకుని ఆరా తీయగా.. సంచలన విషయాలు బయటపెట్టాడు.

‘మా చెల్లి ఫోన్ చూస్తుందని.. మా అమ్మ మెడకు చున్నీతో ఉరి వేయబోయింది. అది హఠాత్తుగా ఉరి బిగుసుకుని మా చెల్లిని చనిపోయింది. దీంతో కోపం మా అమ్మను చంపేసి పారిపోయా..’ అంటూ పోలీసులకు తెలిపాడు. క్షణాకావేశానికి రెండు ప్రాణాలు బలవ్వడం స్థానికంగా తీవ్ర విషాదం నింపింది.