పొట్టలో మొబైల్ ఫోన్

పొట్టలో మొబైల్ ఫోన్

కడుపు నొప్పితో ఆస్పత్రిలో చేరిన వ్యక్తిని పరీక్షించిన వైద్యులు.. అతడి పొట్టలో మొబైల్ ఫోన్ ఉండటంతో అవాక్కయ్యారు. దీంతో అతడికి వెంటనే ఆపరేషన్ చేసిన మొబైల్‌ను బయటకు తీశారు. విచిత్రమైన ఈ ఘటన ఈజిప్ట్‌లో చోటు చేసుకుంది. దక్షిణ ఈజిప్ట్‌లోని ఆస్వాన్‌ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఆరు నెలల కిందట పొరపాటున నోకియా 3310 మొబైల్‌ను మింగేశాడు. అయితే, అది మలం ద్వారా బయటకొచ్చేస్తుందని భావించిన అతడు వైద్యులను సంప్రదించలేదు. మొదట్లో సమస్య లేకున్నా.. తర్వాత అతడికి ఆహారం తీసుకోవడం కష్టంగా మారింది.

క్రమంగా కడుపులో విపరీతంగా నొప్పి రావడంతో ఆస్పత్రిలో చేరాడు. వైద్యులు పరీక్షలు నిర్వహించగా.. కడుపులో మొబైల్‌ ఫోన్‌ను గుర్తించారు. ఆ ఫోన్‌ చాలాకాలం లోపలే ఉండిపోవడంతో కడుపు.. పేగుల్లో గాయాలై, ఇన్‌ఫెక్షన్‌ సోకిందని వైద్యులు తెలిపారు. వెంటనే శస్త్రచికిత్స చేసి మొబైల్‌ను బయటకు తీశారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని.. తొందరగానే కోలుకుంటాడని వైద్యులు చెప్పారు. అస్వాన్ యూనివర్సిటీ ఆస్పత్రిలో ఈ ఆపరేషన్ నిర్వహించారు.

ఆస్పత్రి ఛైర్మన్ మొహమద్ అల్-దాహ్షరీ మాట్లాడుతూ.. ఓ వ్యక్తి మొబైల్‌ఫోన్‌ను మింగేయడం తొలిసారి కావచ్చని వ్యాఖ్యానించారు. కొసోవో ప్రిస్టినాకు చెందిన బాధితుడు నొకియా 3310 మోడల్ ఫోన్ మింగేశాడని తెలిపారు. అతడి పొట్టలోకి వెళ్లిన తర్వాత మొబైల్ బ్యాటరీ పేలి ఉండొచ్చని, అందుకే అంతర్గత అవయవాలకు గాయాలయ్యాయని అన్నారు. మొత్తం మూడు భాగాలైనట్టు ఎక్స్‌రేలో గుర్తించి, ఆపరేషన్ ద్వారా బయటకు తీసినట్టు వివరించారు.