భార్య తనను మోసం చేసి మరో వ్యక్తితో వెళ్లిపోయిందన్న కోపంతో ఓ వ్యక్తి హంతకుడిగా మారాడు. ఒంటరి మహిళలను టార్గెట్ చేసి ప్రాణాలు తీస్తున్నాడు. ఈ కేసులను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సిద్దిపేట పోలీసులు ఆ నరహంతకుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట గ్రామానికి చెందిన షేక్ షాబుద్దీన్ కలాయి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గతంలో అతడి భార్య మరో వ్యక్తితో వెళ్లిపోవడంతో ఆవేదన చెందాడు. ఈ ఘటనలో ఇద్దరు బంధువుల ప్రమేయం ఉందని భావించి వారిద్దరిని హత్య చేశాడు.
ఈ కేసులో న్యాయస్థానం 2006లో జీవితఖైదు విధించడంతో చర్లపల్లి జైలులో శిక్ష అనుభవించాడు.రెండు నెలల క్రితం బెయిల్‌పై బయటకు షాబుద్దీన్ ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకున్నాడు. గతంలో పరిచయం ఉన్న సిద్దిపేట పట్టణం కేసీఆర్ నగర్‌కు చెందిన లక్ష్మి వద్దకు ఈ నెల 1వ తేదీన వెళ్లి తన లైంగిక కోరిక తీర్చాలని కోరాడు. ఆమె నిరాకరించడంతో మెడకు చీర కొంగుతో బిగించి హత్య చేశాడు. అదే రోజు రాత్రి దుద్దెడ గ్రామంలో ఒంటరిగా ఉంటున్న స్వరూప దగ్గరికి మద్యం మత్తులో వెళ్లి కోరిక తీర్చాలని అడిగాడు.
ఆమె కోపగించుకుని తిట్టడంతో ఆవేశానికి గురై బండరాయితో తలపై కొట్టి చంపేశాడు. ఒకేరోజు జరిగిన ఈ రెండు హత్యలకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.ఈ క్రమంలోనే సోమవారం సిద్దిపేట పాత బస్టాండ్ సమీపంలోని కల్లు కాంపౌండ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న షాబుద్దీన్‌ని అదుపులోకి తీసుకుని విచారించగా రెండు హత్యలు తానే చేసినట్లు అంగీకరించాడు. మృతురాళ్ల నుంచి దొంగిలించిన రెండు సెల్ఫోన్లను నిందితుడిని నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. షేక్ షాబుద్దీన్‌ని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.