ట్రాన్స్జెండర్ను యువకుడు వివాహం చేసుకున్న అరుదైన ఘటన తమిళనాడులో జరిగింది. కల్లకురిచి జిల్లా చింతాద్రిపేట్కు చెందిన మనో అనే యువకుడు.. ట్రాన్స్జెండర్ మహిళ రియా కొన్నాళ్లుగా ప్రేమించుకున్నారు. చెన్నైలో ఉద్యోగం చేస్తున్న ఇద్దరూ పెళ్లిచేసుకోవాలని భావించి ఈ విషయాన్ని పెద్దలకు చెప్పారు. అయితే, ఈ వివాహానికి ఇరువురి తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో వారి అనుమతి లేకుండానే పెళ్లిచేసుకున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం ఈ జంట ఒక్కటయ్యింది.
వధూవరులను ఆశీర్వదించేందుకు తమిళనాడులో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ట్రాన్స్జెండర్లు వివాహానికి హాజరయ్యారు. అత్యంత వైభవంగా వివాహం జరిపించారు. అయితే, తమిళనాడులో ఈ తరహా వివాహలు సర్వసాధారణం. కోయంబత్తూర్, తూత్తుకుడి జిల్లాల్లో ఎక్కువగా జరుగుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కోయంబత్తూరులో ఓ జంట వివాహం చేసుకోగా.. దానిని రిజిస్ట్రేషన్ చేయడానికి అధికారి నిరాకరించారు. దీంతో ఆ జంట మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేయాలని మదురై ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది.