జాతుల మధ్య వైరంతో మణిపుర్ రాష్ట్రం రావణకాష్టంలా మారుతుంటే.. ఇన్ని నెలల నుంచి ఆ రాష్ట్రంలో అల్లర్లు చెలరేగుతుంటే.. వందల మంది ప్రాణాలు కోల్పోతుంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాత్రం ఏం పట్టనట్లు వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ మండిపడింది. ప్రధానికి ఇన్ని రోజుల నుంచి ఆ రాష్ట్రంలో పర్యటించాడనికి సమయమే దొరకలేదా అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ విమర్శలు గుప్పించారు. ఆయన అన్ని రాష్ట్రాల్లో పర్యటిస్తున్న మణిపుర్‌ను సందర్శించే సమయం లేకపోవడం ఎంతో బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. మోదీకి దేశంలో ఏం జరుగుతున్నా పట్టింపు లేదని.. మణిపుర్ రాష్ట్రాన్ని విడిచిపెట్టారని ఫైర్ అయ్యారు.
మణిపుర్ హింసలో విద్యార్థులను లక్ష్యంగా చేసుకున్న భయానక ఫొటోలు మరోసారి యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఈ గొడవలో మహిళలు, పిల్లలను హింసించడం ఆయుధంగా మారిందని ఇప్పుడు స్పష్టమవుతోందని చెప్పారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్‌ను తొలగిస్తేనే అక్కడి హింసాకాండను ఆపేందుకు మొదటి అడుగు వేసినట్లు అవుతుందని ఖర్గే పేర్కొన్నారు.