వారు చనిపోయింది షాక్ వేవ్స్ వలన ?

కర్నూలు జిల్లా వెల్దుర్తిలో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణ గద్వాల జిల్లా రామాపురానికి చెందిన 15 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తోన్న ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్ బస్సు ఓ ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి డివైడర్ దాటి అవతలివైపు వెళ్తోన్న తూఫాన్ జీప్ ని ఢీకొట్టింది. దీంతో వాహనంలోని 11 మంది అక్కడికక్కడే మృతిచెందగా, మరో నలుగురు హాస్పిటల్ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. అయితే, తూఫాను వాహనాన్ని బస్సు ఢీకొట్టిన సందర్భంలో అందులోని ఐదుగురు మాత్రమే తీవ్రగాయాలతో మృతిచెందారు. వీరంతా ముందు సీట్లో డ్రైవర్‌ పక్కన కూర్చొన్నవారే కాగా, అయితే వెనుక కూర్చున్న వ్యక్తులు మాత్రం షాక్‌ వేవ్స్‌‌కు గురై శరీరంలోని అవయవాలు అంతర్గతంగా దెబ్బతిని ప్రాణాలు కోల్పోయారని రవాణా శాఖ పరిశీలనలో తేలింది. సాధారణంగా అతివేగంతో ప్రయాణిస్తున్న రెండు వాహనాలు పరస్పరం ఢీకొన్నప్పుడు ఒక్కసారిగా షాక్ వేవ్స్‌కు గురికావడం వల్ల అంతర్గత అవయవాలు దెబ్బతింటాయి. తాజా ప్రమాదంలో బస్సు 93 కిలోమీటరు వేగంతోనూ, తూఫాను వాహనం 80-90 కిలోమీటరు వేగంతో వెళ్తున్నాయి. ఈ రెండు ఢీకొట్టిన సందర్భంలో అదురుపాటుకు వెనుక వరుసలో ఉన్నవారి శరీరంలోని అవయవాలు అంతర్గతంగా ఛిద్రమై మృతిచెంది ఉంటారని వివరించారు.