మహారాష్ట్రలో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో 13 మావోయిస్టులు మృతిచెందారు. గడ్చిరోలి జిల్లాలోని ఎటపల్లి అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. పోలీసుల కాల్పుల్లో ఎనిమిది మంది మావోయిస్ట్‌లు హతమయ్యారు. పోటేగావ్, రాజోలీ మధ్య అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో సీ-60 కమాండోలు ఆ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో ఓ గ్రామానికి సమీపంలో మావోయిస్ట్‌ల స్థావరాన్ని గుర్తించారు.
పోలీసులు రాకను గమనించి మావోయిస్టులు కాల్పులు జరపడంతో భద్రత బలగాలు అప్రమత్తమయ్యాయి. ఎదురు కాల్పులు ప్రారంభించడంతో 13 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఘటనా స్థలిలో కొన్ని ఆయుధాలు, విప్లవ సాహిత్యం, ఇతర వస్తువులను భద్రత బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. టెండూల్కర్ ఆకుల ఒప్పందానికి సంబంధించి గ్రామస్థులతో కసనూరు దళానికి చెందిన మావోయిస్టులు సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నారని పోలీసులకు సమాచారం అందినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
గురువారం రాత్రి గ్రామస్థులను కలిసిన మావోయిస్టులు తెల్లవారుజామున అక్కడ నుంచి వెళ్లాల్సి ఉంది. కానీ, వారు ఊహించని విధంగా పోలీసులు దాడిచేశారు. పగటిపూట ఎన్‌కౌంటర్ జరిగిందని నక్సల్ రేంజ్ డీఐజీ సందీప్ పాటిల్ తెలిపారు. ‘అడవిలో మావోయిస్టుల ఉనికి గురించి తెలుసుకున్న తరువాత మేము ఒక రోజు కిందట ఆపరేషన్ ప్రారంభించాం… ఇప్పటివరకు 13 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు… ఇంకా ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి’ అని ఆయన చెప్పారు.