Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మీడియాకు చెందిన వ్యక్తులయినప్పటికీ.. ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీ రావు కానీ, ఆయన కుటుంబ సభ్యులు కానీ… ప్రజలముందుకు వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. వ్యక్తిగత విషయాలను కానీ, వ్యాపారానికి సంబంధించిన సంగతుల గురించి కానీ నలుగురితో పంచుకోవడాన్ని వారు అంతగా ఇష్టపడరు. రామోజీరావు కెమెరా మందు కనిపించే సందర్భాలు అత్యంత అరుదు. ఆయన కొడుకులు, కోడళ్లు కూడా ఆయనలానే లో ప్రొఫైల్ మెయింటెన్ చేస్తుంటారు. రామోజీ దివంగత కుమారుడు సుమన్ మాత్రం ఈటీవీలో తరచుగా కనిపించేవారు కానీ… అదీ ప్రొఫెషన్ పరంగానే. కానీ తొలిసారి రామోజీరావు పెద్ద కోడలు, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ ఓ వెబ్ చానల్ కు పూర్తిస్థాయి ఇంటర్వ్యూ ఇచ్చారు. తన వ్యక్తిగత విషయాలతో పాటు అనేక సంగతులను ఈ ఇంటర్వ్యూలో వివరించారు శైలజ. రామోజీ ఇంట కోడలిగా అడుగుపెట్టే అవకాశం ఎలా వచ్చిందో ఆమె ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు.
కోయంబత్తూరులో తాను, తన భర్త కిరణ్ ఒకే కాలేజ్ లో చదువుకున్నామని శైలజ చెప్పారు. అయితే తామిద్దరం ఒకేసారి చదువుకోలేదని, కిరణ్ వెళ్లిపోయిన రెండేళ్లకి తాను ఆ కాలేజ్ లో జాయిన్ అయ్యానని తెలిపారు. తమ ప్రొఫెసర్ సంతానలక్ష్మి తన పేరును అత్తగారికి రికమెండ్ చేశారని, తన బ్యాక్ గ్రౌండ్ కూడా అత్తగారి కుటుంబానికి ఎంతో నచ్చిందని, తన తండ్రికి రాయలసీమలో ఎంతో మంచి పేరు ఉందని ఆమె తెలిపారు. అత్తగారి కుటుంబ సభ్యులు అందరూ తిరుపతిలో తనను చూసి నచ్చానని చెప్పారని గుర్తుచేసుకున్నారు. తర్వాత పెళ్లి జరిగిపోయిందన్నారు. తన భర్త వ్యక్తిత్వం చాలా గొప్పదని ఆమె అన్నారు. ఎవరినైనా సర్ అనే సంబోధిస్తారని, అందరితోను మీరు అంటూ ఎంతో మర్యాదగా మాట్లాడతారని చెప్పారు. తమకు ముగ్గురు అమ్మాయిలని, అందరూ లక్ష్మి, సరస్వతి, పార్వతిలు పుట్టారని అంటుంటారని తెలిపారు. ముగ్గురూ చాలా తెలివికలవారని, మంచి డ్యాన్సర్లని, సంగీతం కూడా నేర్చుకుంటున్నారని చెప్పారు. వారు ముగ్గురూ కలిసి పాడితే వినాలనేది తన కోరికని, తన కోరికను వారు తీరుస్తారా..లేదా అనేది వేచిచూడాలని అన్నారు. తమ పిల్లలకు తాతగారినే మార్గదర్శిగా భావిస్తారని తెలిపారు. తనకు ఒక్క కొడుకు ఉంటే బాగుండేదని అప్పుడప్పుడూ అనిపిస్తుందని, అయితే ఆ మాట అంటే తన కూతుర్లకు కోపమొస్తుందని శైలజ అన్నారు.
తన మరిది సుమన్ చనిపోవడం తమకు ఎంతో బాధ కలిగించిందని, ఆయన మరణంతో తమ కుటుంబంలో ఒక నిశ్శబ్దమైన వాతావరణం నెలకొందని ఆవేదన వ్యక్తంచేశారు. ఈనాడుకు, సాక్షికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉన్నా..జగన్ భార్య భారతికి, శైలజా కిరణ్ కు మధ్య మంచి స్నేహం ఉందని భావిస్తుంటారు. ఈ విషయంపైనా ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు శైలజ. తమకు ఎవరితోనూ వ్యక్తిగత బేధాభిప్రాయాలు లేవని, తమ కుటుంబంలో అందరూ అందరితోనూ స్నేహంగా మెలుగుతామని తెలిపారు. రాజకీయాల్లో ప్రవేశించే ఆలోచన లేదని శైలజా కిరణ్ స్పష్టంచేశారు.