ఎంవీపీకాలనీ సెక్టార్–6లోని ఓ ఇంట్లో వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలివీ.. పత్రుల సుగుణ, దూడ ఉపేంద్ర దంపతులు రెండు నెలలుగా సెక్టార్–6లోని అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. సుగుణ మద్దిలపాలెంలోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. సోమవారం ఉదయం ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది.కొంత సమయం తర్వాత ఉపేంద్ర ఇంటికి వచ్చి సుగుణ తలుపులు తీయ్ అంటూ గట్టిగా అరిచాడు.
ఇది గమనించిన ఇంటి యజమాని పుసర్ల సూర్యారావు వచ్చి ఏమైందని అడిగాడు. తలుపులు తీయడం లేదని ఉపేంద్ర బదులిచ్చాడు. దీంతో ఇద్దరూ కిటికీలో నుంచి చూడగా.. ఆమె ఉరివేసుకుని చనిపోయినట్లు గుర్తించారు. ఈ సమాచారం అందుకున్న ఎంవీపీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనపై ఇంటి యజమాని సూర్యారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎంవీపీ పోలీసులు తెలిపారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.