సినిమా పరిశ్రమలలో ఎంతో మంది తమకున్న ఇమేజ్ను, క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు. తమకున్న ఇమేజ్ను పెట్టుబడిగా పెట్టి ఎన్నో చిత్రాలతో పలువురు స్టార్స్ డబ్బులు సంపాదించారు. ప్రస్తుతం దర్శకుడు మారుతి అదే చాలా సక్సెస్‌ఫుల్‌గా చేసుకు పోతున్నాడు. చిన్న చిత్రాల దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న మారుతి నిర్మాతగా కూడా మారాడు. నిర్మాణంలో మంచి మెలకువలు తెలిసిన మారుతి తక్కువ బడ్జెట్‌తో చిత్రాలను నిర్మించి ఎక్కువ లాభాలను దక్కించుకున్నాడు. తాజాగా మారుతి దర్శకత్వంలో ‘శైలజ రెడ్డి అల్లుడు’ చిత్రం తెరకెక్కుతుంది. అదే సమయంలో ‘బ్రాండ్బాబు’ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.
‘బ్రాండ్ బాబు’ చిత్రంతో కన్నడ స్టార్ నిర్మాత శైలేంద్ర బాబు కొడుకు సుమంత్ శైలేంద్ర హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఈ చిత్రాన్ని అనధికారికంగా శైలేంద్ర బాబు నిర్మిస్తున్నాడు. అయితే మారుతి బ్యానర్లో తెరకెక్కుతున్నట్లుగా బయటకు కవరింగ్‌ను ఇస్తున్నారు. ఇక ఈ చిత్రంకు మారుతి కథను ఇచ్చాడు. స్టోరీ లైన్ ఇచ్చి, తన టీంతో స్క్రిప్ట్‌ను సిద్దం చేయించాడు. దాంతో మారుతి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అంటూ టైటిల్ కార్డ్ వేయబోతున్నారు. దర్శకుడు ప్రభాకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. మారుతి బ్రాండ్‌తో ఈ చిత్రం భారీగా పబ్లిసిటీ దక్కించుకుంది. మారుతి ఈ చిత్రంకు ఒక్క రూపాయి పెట్టకున్నా దాదాపుగా రెండు కోట్లు అప్పుడే ఆయనకు ముట్టినట్లుగా తెలుస్తోంది. ఇక సినిమా సక్సెస్ అయితే లాభాల్లో 30 శాతం వాటాను ఇచ్చేట్లుగా ఒప్పందం కుదుర్చుకున్నారు. మొత్తానికి మారుతి పెట్టుబడి లేకుండానే తన పేరుతో కోట్లు సంపాదిస్తున్నాడు.