సులువుగా డబ్బు సంపాదించాలనుకుని చైన్‌స్నాచర్‌గా మారిన ఎంబీఏ పట్టభద్రుడు ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డాడు. వివరాలను సోమవారం హిందూపురం రూరల్ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రమ్య వెల్లడించారు. కర్ణాటకలోని తుమకూరుకు చెందిన అభిలాష్ ఎంబీఏ పూర్తి చేసి సులువుగా డబ్బు సంపాదించాలనుకుని గుప్త నిధుల కేసులో పాత నేరస్తుడిగా ఉన్న తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా వెంకటాపురానికి చెందిన జనత్‌కుమార్‌తో చేతులు కలిపాడు.
గుప్తనిధులు వెలికి తీసేందుకు అవసరమైన సాంకేతిక పరికరాలు కొనుగోలు చేసేందుకు చైన్‌స్నాచింగ్‌లకు తెరతీశారు. ఈ క్రమంలోనే హిందూపురంలోని పాండురంగనగర్, టీచర్స్‌కాలనీ, శ్రీనివాసనగర్, పెనుకొండలోని ఆల్విన్ కాలనీ, అనంతపురంలోని రాంనగర్లో చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడ్డారు.
తాము అపహరించిన బంగారు చైన్లను సోమవారం హిందూపురంలో విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా హిందూపురం రూరల్ సీఐ హహీద్‌ఖాన్, ఎస్ఐ శ్రీనివాసులు గుర్తించి అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. వారి నుంచి రూ.1.90 లక్షలు విలువ చేసే రెండు ద్విచక్ర వాహనాలు, రూ.15 లక్షలు విలువ చేసే 30.50 తులాల బరువున్న 8 బంగారు మాంగళ్యం చైన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు.