ఏపీలో జగన్ ప్రభుత్వానికి కేంద్ర సర్కార్ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో మూడు మెడికల్ కాలేజీలు పెట్టేందుకు అనుమతులు మంజూరు చేసింది. దీంతో రాష్ట్రంలో మూడు చోట్ల మెడికల్ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి. గుంటూరు జిల్లాలోని గురజాల, విశాఖపట్నంలోని పాడేరు, కృష్ణాజిల్లాలోని మచిలీపట్నంలలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌కు ఆదేశాలు అందాయి.
ఒక్కొక్క మెడికల్ కాలేజీ ఏర్పాటుకు రూ. 325 కోట్లను ఖర్చు చేయనుంది ప్రభుత్వం. ఇలా మూడు కాలేజీలకు మొత్తంగా రూ. 975 కోట్లు ఖర్చు కానున్నాయి. ఇందులో కేంద్రం వాటా 60 శాతం ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం వాటా 40 శాతం ఉంటుందని మోదీ సర్కార్ నిర్ధారించింది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నాయి. ఏపీలో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని గతంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ క్రమంలోనే కేంద్రం ప్రాయోజిత పథకాల కింద రాష్ట్రానికి మూడు మెడికల్ కాలేజీలను కేటాయించాలని నిర్ణయించింది.