Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఒకే మనిషి… అదే శక్తిసామర్ధ్యాలు … కానీ భిన్న ఫలితాలు. ఎందుకిలా ? చాలా మందిని చాలా సార్లు వేధించే ప్రశ్న ఇది. ఈ ప్రశ్నకు ఒక్కటే సమాధానం “కాలం”. మన జీవన ప్రవాహాన్ని కాలమాన పరిస్థితులకి సరిగ్గా అన్వయించగలిగితే ఫలితాలు బాగా వస్తాయి. అదే ఎదురు వెళితే ఎంతటి వారికైనా చేదు అనుభవాలు తప్పవు. రాజకీయాలకు సంబంధించి మెగా స్టార్ చిరంజీవికి కూడా ఇలాంటి పరిస్థితులే వచ్చాయి. ఆయన అప్పుడు కాకుండా అంటే 2009 లో కాకుండా కాస్త ముందో , వెనుకో రాజకీయాల్లోకి వచ్చి ఉంటే సీన్ ఇంకోలా ఉండేది.
చిరు కాలానికి ఎదురు ఈదడానికి సిద్ధపడి 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం జెండాతో జనం ముందుకు వెళ్లారు. నిజానికి అప్పుడు వై.ఎస్, చంద్రబాబు లాంటి రాజకీయ దిగ్గజాలు అధికారం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఇక సరికొత్త రాజకీయాల పేరుతో మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాశ్ నారాయణ లోక్ సత్తా మీద మధ్యతరగతి, చదువుకున్న వారిలో ఏవో ఆశలున్నాయి. అటు తెలంగాణాలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నినాదం జోరందుకుంది. ఇన్ని ప్రతికూలతలు వున్న 2009 లో రాజకీయ అరంగేట్రానికి రెడీ కావడమే కాలానికి ఎదురు వెళ్లడం .
నిజానికి చిరు కి వున్న ఇమేజ్ దృష్ట్యా 2004 లో రాజకీయాల్లోకి వచ్చి ఉంటే పరిస్థితి ఒకలా ఉండేది. అప్పట్లో చంద్రబాబు మీద వ్యతిరేకత కాంగ్ర్రెస్ లేదా వై.ఎస్ కి వరం అయ్యింది. అప్పుడే చిరు రంగప్రవేశం చేసి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేది. లేదా 2014 లో రాష్ట్ర విభజన తరువాత చిరు పాలిటిక్స్ లోకి ఎంటర్ అయి ఉంటే క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు ఉండేవి. ఆ సమయంలో వివిధ రాజకీయ పార్టీల వైఖరితో జనం విసిగిపోయివున్నారు. చంద్రబాబు మీద పెద్దగా ప్రేమ లేకున్నా విభజన నేపథ్యంలో జగన్ తో పోల్చుకుని ఆయన అనుభవానికి పెద్ద పీట వేశారు. 2014 వదిలేసి 2019 లో నేరుగా రాజకీయాల్లోకి వచ్చినా చిరు పరిస్థితి బాగా ఉండేది. రాజకీయ పరిణామాలను కాస్త లోతుగా పరిశీలిస్తే గడిచిన పదిహేను సంవత్సరాల్లో 2009 కాకుండా ఎప్పుడు రాజకీయాల్లోకి వచ్చినా చిరు సీఎం అయ్యే అవకాశాలు మెండుగా ఉండేవి. ఆ టైమింగ్ మిస్ కావడమే రాజకీయంగా చిరు కి ఎదురు దెబ్బ తగిలేలా చేసింది.