Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఇటీవల స్టార్ హీరోలు సంవత్సరంకు ఒకటి లేదా రెండు చిత్రాలు మాత్రమే చేస్తున్నారు. కొందరు హీరోలు సంవత్సరంలో కనీసం ఒక్క సినిమాను అయినా కూడా విడుదల చేయలేక పోతున్నారు. ఈ సంవత్సరం రామ్ చరణ్ నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పెరిగిన బడ్జెట్ మరియు ఇతరత్ర కారణాల వల్ల ఒక హీరో ఒక సమయంలో ఒకే సినిమాను మాత్రమే చేస్తున్నారు. అందుకే అప్పట్లో మాదిరిగా సినిమాల సంఖ్య విషయంలో హీరోలు చాలా వెనుకబడి ఉంటున్నారు. కాని మెగా హీరోలు సాయి ధరమ్ తేజ్ మరియు వరుణ్ తేజ్‌లు ఇతర హీరోలతో పోల్చితే చాలా స్పీడ్‌గా ఉంటున్నారు.
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నిన్న ‘జవాన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడో లేదో అప్పుడే రెండు సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. మరో రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. వచ్చే సంవత్సరం నాలుగు లేదా అయిదు సినిమాలు తేజూ తీసుకు వచ్చే అవకాశం ఉంది. ఇక తేజూతో పాటు వరుణ్ కూడా జోరుమీదున్నాడు. ఇటీవలే ఫిదా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వరుణ్ తర్వాత సినిమాతో రెడీ అయ్యాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వరుణ్ తేజ్ చేస్తున్న చిత్రం షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ‘తొలిప్రేమ’ అనే టైటిల్‌ను ఈ చిత్రం కోసం పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ చిత్రం కాకుండా వరణ్ మరో రెండు సినిమాలు కూడా లైన్లో ఉన్నాయి. ఆ సినిమాలు కూడా 2018లోనే విడుదల అయ్యే అవకాశం ఉంది. అంటే వచ్చే సంవత్సరం వరుణ్ మొత్తంగా మూడు సినిమాలను విడుదల చేయబోతున్నాడన్నమాట.