ఆర్టీసీ సమ్మె నేపథ్యలో మెజార్టీ సిటీజనులతో పాటు..దూర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన ప్రయాణీకులు మెట్రో రైళ్లలో ప్రయాణిస్తుండడంతో మెట్రో రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. గ్రేటర్‌వాసుల కలల మెట్రో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. సోమవారం అత్యధికంగా 3.80 లక్షల మంది ప్రయాణికులతో తాజా రికార్డును బద్దలుకొట్టింది. ఇటీవల 3.75 లక్షల మందితో రికార్డు నెలకొల్పగా..సోమవారం రద్దీ 3.80 లక్షలకు చేరుకోవడం విశేషం.ఉదయం 6 నుంచి రాత్రి 11.30 గంటల వరకు పలు రూట్లలో మెట్రో రైళ్లు రద్దీగా కనిపిస్తున్నాయి. ఎల్బీనగర్–మియాపూర్ రూట్లోని ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, ఎంజీబీఎస్, నాంపల్లి, అమీర్‌పేట్, మియాపూర్ స్టేషన్లలో రద్దీ అనూహ్యంగా పెరిగిందని హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు.
ఇక నాగోల్–హైటెక్‌సిటీ రూట్లోని నాగోల్, ఉప్పల్, తార్నాక, మెట్టూగూడా, సికింద్రాబాద్, బేగంపేట్, హైటెక్‌సిటీ స్టేషన్లు రికార్డు సంఖ్యలో ప్రయాణీకులతో కిక్కిరిసిపోతున్నట్లు తెలిపారు. ఆయా స్టేషన్లలో సాధారణ రోజులతో పోలిస్తే ఎంట్రీ, ఎగ్జిట్ అయ్యే ప్రయాణీకుల సంఖ్య సోమవారం రెట్టింపుగా ఉందని తెలిపారు. ప్రయాణీకుల సౌకర్యార్థం ఆయా స్టేషన్లలో ప్రత్యేక టిక్కెట్‌కౌంటర్లు,అదనపు సిబ్బందిని ఏర్పాటుచేశామన్నారు. రద్దీ రూట్లలో ప్రతీ మూడు నుంచి ఐదు నిమిషాలకోరైలును నడుపుతున్నామన్నారు. రద్దీ పెరగడంతో రైళ్లలో ఏసీ సదుపాయం అంతగా లేదని..స్టేషన్లలో టాయిలెట్స్‌వద్ద ,టిక్కెట్ కౌంటర్ల రద్దీతో ఇబ్బందులపాలయినట్లు ప్రయాణీకులు వాపోయారు.