కట్నం తెమ్మని అత్తారింటి వేధింపులు… నవ వధవు ఆత్మహత్య

కంటికి రెప్పలా కాపాడాల్సిన భర్తే ఆమె పాలిట కాలయముడు.....

తెలంగాణలో వరకట్నం వేధింపుల కారణంగా ఒక యువతి ఆత్మహత్యం చేసుకుంది. వరకట్న వేధింపులను తాలలేక ఓ నవ వధువు ప్రాణాలను విడిచింది. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామానికి చెందిన బత్తుల అనూషకు మేడ్చల్‌ జిల్లా దమ్మాయిగూడకు చెందిన జనార్దన్‌తో మే నెలలో వివాహమైంది. అనూషను అత్తింట్లో అడుగుపెట్టిన కొద్ది రోజులకే అదనపు కట్నం తీసుకు రావాలంటూ భర్త జనార్దన్, అత్తమామలు, ఆడపడుచు వేదవతి చాలా తీవ్రాతి తీవ్రంగా రోజూ వేధించసాగారు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె అత్తగారింట్లోనే ఈ నెల 5వ తేదీన గుర్తు తెలియని ద్రావకం తాగేసి పుట్టింటికి వెళ్లింది.

అయతే అక్కడ కాసేపటికే అనూష కళ్లు తిరిగి పడిపోవడంతో కుటుంబసభ్యులు భువనగిరి ప్రభుత్వాసుపత్రికి  తీసుకెళ్లారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కాగా చికిత్స తర్వాత కోలుకున్న ఆమెను మరుసటి రోజే ఇంటికి తీసుకొచ్చారు. అయితే అదేరోజు సాయంత్రం అనూషకు ఛాతీనొప్పి రావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది. అదనపు కట్నం కోసం అత్తింటివారు వేధించడంతోనే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లి దుబ్బాల బాలమణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆలేరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.