ఓ వైపు ప్రజలకి ఏటీఎం సెంటర్లలో డబ్బులేదు, ఏటీఎంల్లో నో క్యాష్ బోర్డులతో అల్లాడుతుంటే అసోంలోని ఓ ఏటీఎంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. టిన్సుకియా లైపులి ప్రాంతంలోని ఓ ఏటీఎంలో ఉంచిన రూ 12.38 లక్షలను ఎలుక కొరికేసింది. మే 19న ప్రైవేట్ సెక్యూరిటీ కంపెనీ ఈ ఏటీఎంలో రూ 29.48 లక్షల విలువైన రూ 2000, రూ 500 నోట్లను నింపింది. ఆ మరుసటి రోజు నుంచి ఏటీఎం పనిచేయడం లేదని జూన్ 11న సెక్యూరిటీ కంపెనీ ప్రతినిధులు ఏటీఎంను తిరిగి ఓపెన్ చేయగా రూ 12.38 లక్షలను ఎలుకలు కొరికేసి చిందరవందరగా పడిఉండటాన్ని గుర్తించారు. మెషీన్లో దూరిన ఎలుకే ఈ పనిచేసిందని భావిస్తున్నారు.
ఎలుకలు తిన్న వాటిలో 500, రెండు వేల రూపాయల నోట్లే అధికంగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. అయితే ఏటీఎంలలో పటిష్టమైన బాక్సులలో ఉంచిన నగదును ఎలుకలు తినడంపై జనాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిదంటూ విమర్శిస్తున్నారు. నష్టాలు చూపడం మీదా వాటివల్ల ఎడపెడా చార్జీలు బాదడం అలవాటైన బ్యాంకు యాజమాన్యాలు ఆ మాత్రం చుసుకోలేవా అని ప్రశ్నిస్తున్నారు. దీనిపై టిన్సుకియా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది.