Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రస్తుతం భారత క్రికెట్ ను శాసిస్తున్న విరాట్ కోహ్లీని అందరూ సచిన్ టెండూల్కర్ తో పోలుస్తున్నారు. కోహ్లీ సచిన్ స్థాయికి ఎదుగుతాడని జోస్యం చెబుతున్నారు. మరికొందరైతే సచిన్ కన్నా వేగంగా విరాట్ పరుగులు రాబడుతున్నాడని, సచిన్ ను మించిపోతాడనీ అంచనాలు వేస్తున్నారు. అయితే ఈ వాదనలన్నింటినీ తోసిపుచ్చుతున్నాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ కాస్ప్రొవిజ్.
ప్రపంచ క్రికెట్లో సచిన్ టెండూల్కర్ ఎప్పటికీ ఒక్కడే అని, ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీచేయలేరని కాస్ప్రొవిజ్ అభిప్రాయపడ్డాడు. సచిన్ భారత్ కు ఎన్నో విజయాలు అందించాడని, కీలక సమయాల్లో జట్టును ఆదుకున్నాడని, అలాంటి సచిన్ తో కోహ్లీని పోల్చడం సరికాదని కాస్ప్రొవిజ్ సూచించాడు.
ఇందుకు ఉదాహరణగా రెండు దశాబ్దాల క్రితం షార్జాలో ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరిగిన మ్యాచ్ ను గుర్తుచేశాడు. ఆ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 272 పరుగులు చేసిందని, అప్పట్లో ఆ స్కోరు భారత్ కు చాలా సవాల్ వంటిదని తెలిపాడు. 273 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ తడబడిందని, గంగూలీ కూడా ఔటవడంతో ఇంక మ్యాచ్ తమదే అని అందరం అనుకున్నామని, అయితే సచిన్ కీలక సమయంలో భారాన్ని తన భుజాలపై వేసుకుని 134 పరుగులతో భారత్ ను గెలుపుతీరాలకు చేర్చాడని కాస్ప్రొవిజ్ వివరించాడు. సచిన్ స్థానంలో కోహ్లి ఉంటే అలా ఆడగలిగే వాడా అని ప్రశ్నించాడు. కోహ్లీ టీమిండియా కెప్టెన్ గా జట్టును ముందుండి నడిపిస్తున్నాడనంలో ఎలాంటి సందేహం లేదని, అయితే అతను సచిన్ స్థానాన్ని భర్తీచేయలేడని కాస్ప్రొవిజ్ అభిప్రాయపడ్డాడు.