ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్, మాజీ ఎమ్మెల్సీ, పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్ ఈరోజు కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 85 ఏళ్ళు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న వేణుమాధవ్ నేడు తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 1932 డిసెంబర్ 28న మట్టెవాడలో జన్మించిన వేణుమాధవ్ 1947లో పదహారేళ్లకే నేరెళ్ల తన మిమిక్రీ కెరీర్‌ను ప్రారంభించారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, ఉర్దూ, తమిళంలో ఆయన వేలాది ప్రదర్శనలు చేశారు. మిమిక్రీ రంగంలో తన సొంత ఒరవడితో, తనదైన శైలితో స్వరబ్రహ్మగా వేణుమాధవ్ పేరుతెచ్చుకున్నారు. దేశవిదేశాల్లో నేరెళ్ల వేణుమాధవ్ చేసిన ప్రదర్శనలు ఎంతో పేరుతెచ్చిపెట్టాయి.
కళారంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం ఇటీవల ఆయన పేరుతో పోస్టల్ స్టాంప్ విడుదల చేసింది. కళారంగానికి ఆయన చేసిన సేవలకు గాను 2001లో నేరెళ్ల వేణుమాధవ్‌కు పద్మశ్రీ పురస్కారం లభించింది. ప్రముఖ నిర్మాత బీఎన్ రెడ్డి ప్రోద్బలంతో సినిమాల్లో నటించారు నేరెళ్ల వేణుమాధవ్. దాదాపు పన్నెండు సినిమాల్లో ముఖ్యమైన పాత్రలు పోషించారు. పీవీ నర్సింహా రావు సీఎంగా ఉన్నప్పుడు ఆయనను ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు. దీంతో 1972 నుంచి 1978 వరకు వేణుమాధవ్ ఎమ్మెల్సీగా పనిచేశారు. హన్మకొండ పబ్లిక్ గార్డెన్‌లోని ఆడిటోరియానికి నేరెళ్ల వేణుమాధవ్ కళా ప్రాంగణంగా నామకరణం చేశారు.